Jalsa: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ విజయం అందుకున్న చిత్రాల్లో జల్సా ఒకటి. థియేటర్స్ లో విడుదలై ఈ చిత్రం తాజాగా 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జల్సా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఇది. నువ్వే నువ్వే, అతడు సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా ఇది మూడో చిత్రం కాగా.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 13వ చిత్రం. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ జల్సా మూవీని నిర్మించారు.
ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తే.. ముకేష్ రిషి, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, పార్వతీ మెల్టన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 2008 మార్చి 27న జల్సా మూవీ విడుదల కావాల్సింది. కానీ డిఐ ప్రక్రియలో జాప్యం కారణంగా విడుదల ఆలస్యమైంది. ఫైనల్ గా అదే ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో 800 థియేటర్లలో జల్సా మూవీ 400 ప్రింట్లతో విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఇలియానా గ్లామర్, కామెడీ ట్రాక్, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు సాంగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. టాక్ అనుకూలంగా జల్సా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన జల్సా మూవీ.. అప్పట్లో ఫుల్ రన్ ముగిసే లోపు రూ. 28.90 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఒక్క నైజాంలోనే ఈ చిత్రానికి రూ. 9.35 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.
2008లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా జల్సా రికార్డు సృష్టించింది. అలాగే ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.3.89 కోట్ల లాభాలను అందుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. జల్సా మూవీలో సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ సంతోషం అవార్డు అందుకున్నాడు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. జల్సా మూవీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. మరియు ఈ మూవీకి ఇలియానా పాత్రకు కలర్స్ స్వాతి డబ్బింగ్ చెప్పింది.
ఇకపోతే జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 2022 సెప్టెంబర్ 3న రీమాస్టర్డ్ పిక్చర్ మరియు సౌండ్‌తో రీ-రిలీజ్ చేశారు. ఆ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కలిపి మొత్తం 702 షోలు వేశారు. అనూహ్యంగా అన్ని చోట్ల ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభించింది. అంతేకాదు జల్సా మూవీ రీ-రిలీజ్లో ఏకంగా రూ. 3.25 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసి సరికొత్త రికార్డు సెట్ చేసింది.