మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అయితే రేపు చిరంజీవి బర్త్‌డే కావడంతో.. ఒకరోజు ముందే `గాడ్ ఫాదర్` టీజర్‌ను బయటకు వదిలారు.
`ఇరవై ఏళ్లు ఎక్కడకు వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడన్ గా తిరుగొచ్చిన ఆరేళ్లలోనే జనంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు` అంటూ మురళీ శర్మ డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. `డు యూ నో హూ ఈజ్ హీ ఈజ్ ది బాస్ ఆప్ ది బాసెస్` అంటూ చిరు క్యారెక్టర్ ను టీజర్‌లో అద్భుతంగా ప్రజెంట్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. అలాగే నయనతార చిరు సోదరిగా, సత్యదేవ్ విలన్ పాత్రలో అలరించబోతున్నారని టీజర్ బట్టీ స్పష్టమైంది. విజువల్స్, బ్యాక్‌గ్రైండ్ మ్యూజిక్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ టీజర్ మెగా ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి లేటెందుకు `గాడ్ ఫాదర్` టీజర్‌పై మీరు ఓ లుక్కేసేయండి.