ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి టాలీవుడ్ సెన్సేషన్ హిట్ ఇచ్చారు హీరో కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమాతో మంచి విజయం సాధించడమే కాకుండా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. ఆ తర్వాత హీరో నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ప్రతినాయకుడిగా అలరించి ప్రేక్షకుల మన్నన పొందాడు. హీరోగా, విలన్‌గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందాడు. గుణ 369, 90 ఎంఎల్ వంటి చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాన్ని సాధించాడు. కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బెదురులంక 2012’. ఈ సినిమా థియేటర్లలో నేడు విడుదల అయింది. అయితే కార్తికేయ ఖాతాలో ఆర్ఎక్స్ 100 అంత హిట్ సినిమా ఇప్పటివరకు పడలేదు. హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తికేయ ‘బెదురులంక 2012’తో సక్సెస్ అందుకుంటాడా? ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

సినిమా పేరు: బెదురులంక 2012
నటీనటులు: కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఎల్‌బీ శ్రీరామ్, సత్య, గోపరాజు రమణ, ఆటో రామ్‌ప్రసాద్ తదితరులు
దర్శకత్వం: క్లాక్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫి: సాయి ప్రకాశ్ ఉమ్మడి సింగు
నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ: 25 ఆగస్టు 2023

సినిమా స్టోరీ..
బెదురులంక సినిమా కథంతా 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ (కార్తికేయ) హైదరాబాద్‌లో గ్రాఫిక్స్ డిజైనర్ ఉద్యోగం మానేసి ఊరికి వస్తాడు. ఊర్లోనే ఉంటాడు. అయితే అప్పటికే ఆ గ్రామంలో యుగాంతం రాబోతుందని భారీ ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ ముప్పు నుంచి ఎలా బయటపడాలని ప్రజలు భయపడుతూ ఉంటారు. గ్రామానికి చెందిన భూషణం (అజయ్ ఘోష్) ఈ భయాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటాడు. దొంగ జాతకాలు చెప్పే బ్రాహ్మణుడు బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (ఆటో రాంప్రసాద్)తో చేతులు కలిపి నిజంగానే యుగాంతం రాబోతుందని ప్రజలను నమ్మిస్తాడు.
ఈ యుగాంతం అంతం కావాలంటే అందరి ఇళ్లల్లో ఉన్న బంగారం తీసుకొచ్చి ఇవ్వాలని, ఆ బంగారంతో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగా నదిలో వదిలేయాలని, అప్పుడు యుగాంతం ఆగిపోతుందని నమ్మిస్తారు. ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) ఆదేశంతో గ్రామ ప్రజలంతా బంగారాన్ని ఇస్తారు. కానీ శివ మాత్రం అది మూడ నమ్మకమని కొట్టిపారేస్తాడు. దాంతో గ్రామ ప్రెసిడెంట్ శివను ఊరి నుంచి వెలేస్తాడు. ఆ తర్వాత బెదురులంకలో ఏం జరిగింది? ప్రజల్లో ఉన్న మూడ నమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేస్తాడు? భూషణం ప్లాన్ ఎలా బయటపెడతాడు? ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి)తో ఎలా ప్రేమలో పడతాడు? ఆ అమ్మాయిని శివ పెళ్లి చేసుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది?
వాస్తవానికి 2012లో యుగాంతం రాబోతుందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. అలాంటి ఓ పుకారు వల్ల బెదురులంక గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? మూడ నమ్మకాల కారణంగా ప్రజలు మోసపోతున్నారనేది దర్శకుడు క్లాక్స్ వినోదాత్మకంగా చూపించాడు. యుగాంతం కాన్సెప్ట్‌తో గతంలో హాలీవుడ్‌తో పాటు పలు భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. కానీ బెదురులంక సినిమా చాలా కొత్తగా ఉందనే చెప్పవచ్చు. సినిమా మొత్తం బెదురులంక గ్రామం చుట్టే తిరుగుతుంది. సినిమా ఫస్టాప్ మొత్తం లవ్ ట్రాక్, కామెడీతోనే సాగుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. శివ చేసే పనులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సత్య, వెన్నెల కిశోర్ పాత్రల ఎంట్రీతో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. క్లైమాక్స్ సీన్స్‌ని చూస్తే పగలబడి నవ్వుతారు. మొత్తానికి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్ అని చెప్పవచ్చు.

సినిమాకు ప్లస్ పాయింట్స్..
బెదురులంక 2012లో హీరో కార్తికేయ పాత్ర ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటుంది. కామెడీతో పాటు యాక్షన్ సీన్లు అదరగొట్టాడు. నేహా శెట్టి తక్కువగా కనిపించినప్పటికీ.. ఆమె అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. భూషణం పాత్రలో అజయ్ ఘోష్ ఒదిగిపోయాడు. సినిమా నటించిన పలువురు తమ పాత్రకు న్యాయం చేశారు. సంగీతం పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్ పని తీరు మెచ్చుకోదగింది.
న్యూస్ ఆర్బిట్ రేటింగ్ : 2.75/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.