అంత తక్కువ అమౌంట్ కోసం హేమంత్ ని చంపేశారా .. డీసీపీ చెప్పిన టాప్ సీక్రెట్ !

ప్రేమ హ‌త్య‌లు, దారుణ ఉదంతాల ప‌రంప‌ర‌లో తాజాగా వెలుగుచూసిన రాక్ష‌స ఘ‌ట‌న హేమంత్ హ‌త్య‌.

ప్రేమించి పెళ్లి చేసుకున్న‌ పాపానికి హేమంత్ అనే యువ‌కుడిని దారుణంగా హ‌త్య చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హేమంత్ హ‌త్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.హేమంత్ హ‌త్య కేసు వివ‌రాల‌ను మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు మీడియాకు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న వారు షాక్‌కు గుర‌వుతున్నారు.

 

చిన్నానాటి నుంచే….

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన హేమంత్‌, అవంతి చిన్న‌నాటి నుంచి స్నేహితులు. వారిద్ద‌రి ప్రేమ‌కు అమ్మాయి త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, అవంతి తల్లిదండ్రులు ల‌క్ష్మారెడ్డి, అర్చ‌న ఈ వివాహం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జూన్ 11 నుంచి లక్ష్మారెడ్డి, అర్చ‌న ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాలేదు. అవంతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి హేమంత్‌తో ప్రేమ వివాహం చేసుకున్న‌ద‌ని త‌న గోడును సోద‌రుడు యుగంధ‌ర్ రెడ్డితో అవంతి త‌ల్లి వెళ్ల‌బోసుకుంది. దీంతో త‌న సోద‌రి బాధ‌ను చూడ‌లేక హేమంత్‌, అవంతిని విడ‌దీయాల‌ని యుగంధ‌ర్ ప్లాన్ చేశారు. హేమంత్‌ను హ‌త్య చేసేందుకు నెల రోజుల క్రిత‌మే ప్లాన్ చేశారు.

ప్లాన్ ఎలా వేశారంటే…

నెల రోజుల క్రితం లింగంప‌ల్లిలోని ల‌క్ష్మారెడ్డి నివాసంలో కుటుంబ స‌భ్యులంద‌రూ స‌మావేశ‌మై హేమంత్‌ను అడ్డు తొల‌గించుకునేందుకు ప్లాన్ చేశారు. అవంతి, హేమంత్ నివాసం ఉంటున్న గ‌చ్చిబౌలిలోని టీఎన్జీవో కాల‌నీలో యుగంధ‌ర్‌రెడ్డి, విజ‌యేంద‌ర్ రెడ్డి క‌లిసి గ‌త కొద్ది రోజుల నుంచి రెక్కీ నిర్వ‌హించారు. మొత్తానికి ఈ నెల 24వ తేదీన మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు ఇంట్లోకి 12 మంది బంధువులు చొర‌బ‌డ్డారు. హేమంత్‌, అవంతిపై దాడి చేసి బ‌ల‌వంతంగా కారులో ఎక్కించారు. లింగంప‌ల్లిలో మాట్లాడుకుందామ‌ని చెప్పి వారిని గోప‌న్‌ప‌ల్లి వైపు కారును మ‌ళ్లించారు. దీంతో త‌మ‌కు ప్ర‌మాదం ఉంద‌ని భావించిన హేమంత్‌, అవంతి.. కారులో నుంచి దూకేశారు.

మ‌ళ్లీ బ‌ల‌వంతంగా….

అయితే, హేమంత్‌ను మ‌ళ్లీ కారులోకి ఎక్కించుకొని యుగంధ‌ర్ రెడ్డి కారులో కిరాయి హంత‌కుల‌తో ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి వైపు తీసుకెళ్లారు. జ‌హీరాబాద్‌లో మ‌ద్యం, తాడు కొనుగోలు చేశారు. హేమంత్ చేతులు, కాళ్లు క‌ట్టేసి కారులో చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. మెడ‌కు తాడు బిగించి కారులోనే హ‌త్య చేశారు. రాత్రి 7:30 గంట‌ల‌కు సంగారెడ్డి జిల్లాలోని కిష్ట‌య్య‌గూడెంలో హేమంత్ మృత‌దేహాన్ని పడేశారు. అనంత‌రం ప‌టాన్‌చెరులో మ‌రో ఇద్ద‌రితో క‌లిసి మ‌ద్యం తాగారు. అక్క‌డ్నుంచి సంతోష్ రెడ్డి అనే వ్య‌క్తికి యుగంధ‌ర్ రెడ్డి ఫోన్ చేశాడు. అప్ప‌టికే పోలీసుల అదుపులో సంతోష్ రెడ్డి ఉన్నాడు. ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా యుగంధ‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు వెల్ల‌డించారు. హేమంత్‌ను చంపేందుకు మొత్తం రూ. 10 ల‌క్ష‌ల‌కు కిరాయి హంత‌కుల‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు యుగంధ‌ర్ రెడ్డి. ఈ హ‌త్య కేసులో యుగంధ‌ర్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేశారు.

 

ప్రేమించుకోవ‌డ‌మే మేం చేసిన పాప‌మా?

కులాలు వేరు కావడమే హేమంత్‌ హత్యకు కారణమని అవంతి తెలిపింది. “చిన్ననాటి నుంచి హేమంత్‌ నేను ఒకే ప్రాంతంలో పెరిగాం. ఎనిమిదేళ్ల‌ నుంచి ప్రేమించుకున్నాం. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాం. మా ఇంట్లో వివాహం ఇష్టం లేకపోవడంతో గచ్చిబౌలిలో ఉంటున్నాం. పలుమార్లు బెదిరించడంతో ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదు. హేమంత్‌ను నన్ను మా బంధువులే బలవంతంగా లాక్కెళ్లారు. బావ, వదినలు, మావయ్యలే ఈ హత్య చేయించారు. పెళ్లిముందు మా ప్రేమ విషయం తెలిసి 7 నెలలు నన్ను ఇంటికే పరిమితం చేశారు. పెద్దవారు మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ ఇంతలో దారుణం చేస్తారని ఊహించలేదు’ అని హేమంత్‌ భార్య అవంతి కంటతడి పెట్టారు.