న్యూఢిల్లీ, ఫిబ్రవరి4: కొద్ది రోజుల క్రితం రిపబ్లిక్ డే పెరేడ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పక్కపక్కనే కూర్చుని దీర్ఘంగా ముచ్చటించుకున్న సీను గుర్తుందా? ఈ రోజు రాహుల్ గాంధీ నుంచి నితిన్ గడ్కరీకి ప్రశంసలు లభించాయి. బిజెపిలో దమ్ము ఉన్న నాయకుడు గడ్కరీ ఒక్కడేనని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ ప్రశంసకు దారి తీసిన నితిన్ గడ్కరీ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అయింది. కొద్ది రోజులుగా బిజెపి నాయకత్వంపై పరోక్షంగా సునిశితమైన వ్యాఖ్యలు చేస్తున్న గడ్కరీ ఈ రోజు, ‘ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దలేని వాడు దేశాన్ని ఏం చక్కదిద్దగలడు’ అని వ్యాఖ్యానించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలలో పరాజయంపై అగ్ర నాయకత్వం స్పందించనందుకు నర్మగర్భ వ్యాఖ్యలు చేసి రాజకీయ పరిశీలకులకు పని పెట్టిన గడ్కరీ మాటలు ఈసారి కూడా చర్చనీయాంశంగా మారాయి.
‘గడ్కరీజీ, అభినందనలు. బిజెపిలో కాస్త దమ్ము ఉన్న నాయకుడు మీరే. దయచేసి రఫేల్ స్కామ్, రైతుల దుస్థితి, సంస్థలు విధ్వంసంపై కూడా స్పందించండి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
అయితే రాహుల్ ట్వీట్‌కు గడ్కరీ నుంచి సమాధానానికి ఎక్కువ వ్యవధి పట్టలేదు. ‘నా ధైర్యానికి మీ కితాబు అక్కరలేదు. అయితే ఒక జాతీయ పార్టీకి నాయకుడు అయి ఉండీ మా పార్టీపై దాడికి వక్రీకరించిన మీడియా కథనాలపై ఆధార పడడం చిత్రంగా ఉంది’ ఆని గడ్కరీ పేర్కొన్నారు.
దానికి కూడా రాహుల్ నుంచి జవాబు వచ్చింది. ‘ఓ సారీ గడ్కరీజీ. క్షమించండి. అసలైది మర్చిపోయాను…ఉద్యోగాలు, ఉద్యోగాలు’ అని రాహుల్ మళ్లీ ట్వీట్ చేశారు.
Oops, Gadkari Ji.
Huge apology. I forgot the most important one….
JOBS! JOBS! JOBS! JOBS! https://t.co/SfOLiCUoyg
— Rahul Gandhi (@RahulGandhi) February 4, 2019