రామ్ అనగానే ఫుల్ క్లాస్ ఫిగర్ గుర్తుకొస్తుంది. తెల్లగా, నాజూగ్గా, చురుగ్గా, మనింట్లోనో, మన పక్కింట్లోనో ఉన్న పిల్లలే గుర్తుకొస్తారు. ఎంత మాస్‌గా ఉండాలని ప్రయత్నించినా, కొందరిది క్లాస్ లుక్కే. రామ్ కూడా అందులో ఒకరు. అయితే ఆయన తాజాగా వేసిన ఓ ట్వీట్ మాత్రం ఆయన ఎంత మాసో చెప్పకనే చెప్పింది. కొంతమంది అసలు ఆ మాటలేంటి రామ్ అని నోళ్లు నొక్కుకుంటున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం ఏకంగా `మాస్` అని తనదైన తరహాలో స్పందించింది. ఇంతకీ రామ్ దేని గురించి ట్వీట్ వేశారనేగా మీ అనుమానం… “ఇంటర్ రిజల్ట్స్ ఏ జీవితం అనుకునే నా తమ్ముళ్లకి, చెల్లెళ్లకీ, మీరు జీవితంలో అవ్వబోయేదానికి, చేయబోయేదానికి, ఇది ఒక ఆ…తో సమానం. దయచేసి లైట్ తీసుకోండి.. ఇట్లు ఇంటర్ కూడా పూర్తి చేయని మీ రా పో“ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇది సబబేనా…
ఓదార్చడంలో ఎన్నో రకాలుంటాయి. జీవితం విలువ చెప్పాలనుకున్నప్పుడు దాన్ని మాత్రం చెబితే సరిపోతుంది. అంతేగానీ, చదువు విలువను తగ్గించాల్సిన అవసరం ఏముంటుంది? రామ్ లాంటి ఎక్కడో కొందరికి మాత్రం ఏవో మంచి అవకాశాలు వచ్చినంత మాత్రాన చదువును అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన అవసరం లేదని, హీరోలు చదువుకునేవారికి ఏం చెప్పదలచుకున్నారనీ, అందులోనూ చదువును `ఆ..`తో సమానం అని అంటే, పిల్లలు చదువు పట్ల మరింత నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉందనీ కొందరు వాపోతున్నారు.