రఫేల్ ప్రాజెక్టుపై ఆసక్తి లేదు : హెచ్‌ఎఎల్ చైర్మన్ మాధవన్

బెంగళూరు, ఫిబ్రవరి 21 :  రఫేల్ ఒప్పందాలపై తమకు ఆసక్తి లేదని చైర్మన్ ఆర్ మాధవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గించాయి.

రాజకీయంగా వివాదానికీ దారి తీసిన రఫేల్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

’36 రఫేల్ యుద్ధ విమానాలు నేరుగా కొనుగోలు చేశారు. దీనిలో తయారు చేయడానికి ఏమీలేదు..అందుకే ఈ అంశంపై ఆసక్తి చూపలేదు’ అని మాధవన్ అన్నారు.

ఒక వేళ భారత్‌లో వాటిని తయారు చేసినట్లైయితే తాము ఆసక్తి చూపేవారిమని మాధవన్ పేర్కొన్నారు. భారత్‌లో తయారీ కాకుండా నేరుగా కొనుగోళ్లు అయినా, విదేశీ భాగస్వామ్యమైనా తమకు ఎటువంటి ఆసక్తి లేదని మాధవన్ తెలిపారు.

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) అప్పుల్లో ఉందంటూ మిడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తమ సంస్థకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని మాధవన్ స్పష్టం చేశారు.

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లు ఆ సంస్థ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ సివి ఆనంద్ కృష్ణన్ తెలిపారు. సంస్థ ప్రస్తుతం 12వేల కోట్ల రూపాయల నిధులతో బలంగా ఉందనీ, సంస్థ లాభాలు కూడా పెరుగుతున్నాయని కృష్ణన్ స్పష్టం చేశారు.