రజనీకాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే..!!

 

వైద్యులు వద్దని సూచిస్తున్నా.. ప్రజల, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అధికారిక ప్రకటన అనంతరం తొలిసారిగా రజనీకాంత్ నేడు మీడియాతో మాట్లాడారు.

తమిళనాడు కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాననీ,. రాష్ట్ర ప్రజల కోసం ప్రాణ త్యాగం కూడా వెనుకాడననీ తలైవా పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే ఉన్నారనీ అయినా తాను వాటిని లెక్కచేయననీ అన్నారు. ఇచ్చిన హామీలపై ఎప్పుడూ తాను వెనక్కు తగ్గే ప్రసక్తిలేదనీ, ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందనీ రజనీ అభిప్రాయపడ్డారు. మార్పు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడూ రాదని అన్నారు. రాజకీయాల్లో మార్పునకు ప్రజలు తన వెంట ఉంటే సమిష్టి కృషితో మార్పునకు కృషి చేద్దామన్నారు. ప్రజల ఆదరణతో కష్టపడి పని చేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రజనీ ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ ప్రవేశం కోసం రాష్ట్రంలో పర్యటించాలని భావించినా కరోనా నేపథ్యంలో అది సాధ్యపడలేదన్నారు. తమిళ ప్రజల తలరాతలు మార్చాల్సిన సమయం ఆసన్నమైంద్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని అభిమానులకు పిలుపు నిచ్చారు.సుదీర్ఘ సందిగ్ధతకు తెర దించుతూ రజనీకాంత్ నేడు రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ ప్రారంభిస్తాననీ, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అథ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అధ్బుతాలు జరుగుతాయి. మారుస్తాం..అన్నింటినీ మారుస్తాం..” అని రజనీకాంత్ పేర్కొన్నారు. రాజకీయ ప్రవేశంపై రజనీ కాంత్ ప్రకటన చేయడంతో అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆనందంతో సంబరాలు చేస్తున్నారు.