బస్తీ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 10 : ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రా వస్త్రధారణపై బిజెపి సినియర్ నాయకుడు, ఆ పార్టీ ఎంపి హరీష్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్లోని బస్తీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉన్నప్పుడు జీన్స్ ప్యాంటు, టీషర్టు ధరిస్తారని, నియోజకవర్గానికి వెళ్లినప్పుడు మాత్రమే చీర కట్టుకుంటారని, ఈ విషయం అందరికీ తెలుసునంటూ వ్యాఖ్యానించారు.
‘తనకు గానీ బిజెపికి గానీ ఆమె (ప్రియాంక గాంధీ) సమస్యే కాదని పేర్కొంటూ, రాహుల్ గాంధీ విఫల నేత అయితే ప్రియాంక కూడా విఫల నాయకురాలు అవుతుందని ద్వివేది అన్నారు.
బిజెపి నేతలు ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమీ కాదు.
బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జనవరి 30వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడు రావణ్, ఆయన సోదరి ప్రియాంక గాంధీ శూర్పణక అని విమర్శ చేశారు.
‘రానున్న లోక్సభ ఎన్నికల్లో పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ‘చాక్లెట్ ఫేస్’ ను దింపింది’ అని బిజెపి జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గియ కామెంట్ చేశారు.
ఆమె (ప్రియాంక గాంధీ)ది అందమైన ముఖం అని బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝాహద్ అన్నారు.
ప్రియాంక గాంధీ వారం క్రితం తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.