టీడీపీ పతనానికి బాబు పథక రచన..! కన్ ఫ్యూజింగ్ గా ఉన్నా.., ఇదే నిజం..!?

‘కింద పడ్డా.. నాదే పైచేయి..’ అనే సామెత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, నాయకుల పట్ల వ్యవరించే తీరు, కార్యకర్తలకు ఇచ్చే భరోసా, ఇతర పార్టీలతో నెరిపే సత్సంబంధాలు.. అధికారంలోకి వచ్చాక మచ్చుకైనా ఆయనలో కనపడవు. అప్పటి తొమ్మిదేళ్ల పాలనలో కాదు.. 2014లో అధికారం వచ్చాక 5 ఏళ్లలో ఈ పద్ధతి బాగా కనిపించిందనే చెప్పాలి. ఇవన్నీ నిజమని.. 2019 ఎన్నికల ఫలితాలే నిరూపించాయి. లేదంటే.. ప్రజలు కూర్చున్న కొమ్మను నరుక్కోరు. టీడీపీ చెప్తున్నట్టు.. ఒక్క అవకాశం జగన్ అడిగితే ప్రజలు ఇవ్వరు.. ప్రస్తుత పాలన బాగానే ఉంది కదా.. అంటారు. ఈ లాజిక్ టీడీపీకి తెలిసినా.. పై సామెత ఇక్కడా వర్తిస్తుంది. వీటన్నింటిపై ఆ పార్టీ నేతల్లో కొందరు లోలోపలే వ్యాఖ్యలు చేస్తున్నట్టు సమాచారం.

is chandrababu defaming tdp himself
is chandrababu defaming tdp himself

చంద్రబాబు తీరుపై..

ఏదైనా విషయంపై చంద్రాబాబు స్పందించే విధానం, వివరించే తీరు అద్భుతం. కానీ.. ఇదే పద్ధతి నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కాస్త బోరింగ్ అని చెప్పాలి. రీసెంట్ గా ఒక కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు తీరును విమర్శిస్తున్నారని తెలుస్తోంది. ‘చంద్రబాబుకు టైమ్ వేస్ట్ చేయడం అంటే బాగా ఇష్టం. సుదీర్ఘ ప్రసంగాలు చేయడం అలవాటు. పది నిముషాల్లో చెప్పేదానిని గంటలు చెప్తారు. అధికారం పోయినా ఆయనలో మార్పు రాలేదు. ఆయన పలకరింపులో మర్యాద, ఇతరులకు ఇవ్వాల్సిన గౌరవం ఉండదు. ఎన్టీఆర్, వైఎస్ అలా కాదు.. పలకరింపులో ఆప్యాయత, కుశలం, భుజంపై చేయి వేసి పలకరింపులు, కుటుంబసభ్యుల క్షేమం.. ఇతరత్రా వివరాలతో మర్యాద ఇస్తారు. చంద్రబాబులో అవి మచ్చుకైనా కనపడవు’ అన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీలో సూటిగా, స్పష్టంగానే మాట్లాడే నాయకులే ఇలా అంటున్నారని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడూ చంద్రబాబుపై ఇవే వ్యాఖ్యలు నర్మగర్భంగా వినిపించేవి.

ఇప్పుడూ ఇంతేనా..!

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గత ఐదేళ్లలో ప్రతిరోజూ ఉదయమే టెలి కాన్ఫరెన్స్ నిర్వహించేవారు. ప్రభుత్వంలో కార్యక్రమాలు, పార్టీ చేయాల్సిన పనులు, నాయకులు చేయాల్సినవి, కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి ఏమేం చేయాలి.. ఇలా ప్రతీది స్పష్టంగా చెప్పేవారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వరకూ ఆ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొనేవారు. అయితే.. ఆయన చెప్పేదంతా వినేవారు ఎంతమంది అనేదే ప్రశ్న. అందరూ ఒకే తీరుగా ఉండరనేది ఇక్కడ ప్రస్తావనార్హం. చాలా మంది ఈ ప్రహసనంపై విముఖత వ్యక్తం చేసేవారని అంటారు. స్పీకర్ ఆన్ చేసి ఫోన్లు పక్కన పెట్టేవారూ ఉన్నారని, అసిస్టెంట్లకు ఫోన్లు ఇచ్చి ఏం చెప్పారో తర్వాత అడిగి తెలుసుకోవడం ఉండేవంటారు. సరే.. అప్పుడంటే సీఎం.. తప్పదు.. ఎదురు చెప్పలేరు. ఆ ఐదేళ్లు అలానే గడిచిందని అంటారు. కానీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. పార్టీకి దక్కిన ఘోరమైన ఓటమి, ప్రస్తుత పార్టీ పరిస్థితి.. వీటిని కూడా చంద్రబాబు గుర్తించడం లేదనే వ్యాఖ్యలు వస్తున్నాయి.

ఇప్పటికైనా తీరు మారేనా..!

ప్రతిపక్ష నాయకుడిగా పార్టీకి విధివిధానాలు, దిక్సూచిగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. జూమ్ మీటింగ్స్ తో నిరంతరం పార్టీ నాయకుల్ని, శ్రేణుల్ని కెమెరాల ముందు ఉంచి సుదీర్ఘంగా చెప్పాల్సింది చెప్పడం, టెలీ కాన్ఫరెన్సులతో ఆయన వాగ్దాటి ఇప్పటికీ కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాల కంటే అధినేత గంటల ఉపన్యాసాలే టీడీపీకి ఎక్కువగా ఉంటున్నాయి. ఎన్నికల తర్వాత టీడీపీని వీడిన వారి మాటలే కాదు.. పార్టీలోనే ఉన్న జేసీ దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తి చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘అభివృద్ధి చేయాలనుకోవడమే నేను చేసిన తప్పా..’ అని చంద్రబాబు ఇటివలే వ్యాఖ్యానించారు. ‘నేను వేసిన రోడ్లు, నేను కట్టించిన టాయిలెట్లు, నేనిస్తున్న సరుకులు..’ అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్న వ్యాఖ్యలు. అదే.. మా ప్రభుత్వం చేస్తున్న పనులు అనుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనే వ్యాఖ్యలూ లేకపోలేవు. మరి ఇప్పటికైనా టీడీపీకి జరిగిన, జరుగుతున్న డ్యామేజీని చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకుంటారో లేదో చూడాలి.