నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి మైరుగైన సదుపాయాలు కల్పించి, ఇబ్బందులను తొలగించామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆరు నెలల్లోనే 11.5 శాతం వృద్ది సాధించామన్నారు. ఈ ఏడాది వివిధ రంగాలలో 675 పైగా అవార్డులు సాధించామని గుర్తు చేశారు. కృషి కల్యాణ యోజనలో విజయనగరం, విశాఖ, కడప జిల్లాలు దేశంలోనే నెంబర్ వన్ స్ధానాలు పొందాయని తెలిపారు.

ముందుచూపు, నూతనఆవిష్కరణలు, జవాబుదారీతనంతో డిజిటలైజేషన్, ఉబరైజేషన్,  కన్వర్జెన్స్, టెక్నాలజీలో ట్రాన్స్‌ఫర్మేషన్‌తోనే ఇన్ని అవార్డులు సాధించామని సీఎం తెలిపారు. తాను బృంద నాయకుడిని మాత్రమేనంటూ ఘనత బృందానికే చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుగులేని శక్తిగా రూపొందాలని,  ప్రపంచం ఏపీ వైపే చూడాలని సీఎం ఆకాంక్షించారు. విశాఖలో మెడ్‌టేక్ దేశానికే తలమానికమన్నారు. 5వేల మంది కౌలు రైతులకు పంటరుణాలు మంజురు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించామని తెలియజేశారు. రాష్ట్రంలో కౌలు రైతులకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. పంటబీమాలో  రాష్ట్ర ప్రభుత్వ వాటా వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  పంట బీమా విషయంలో కేంద్రం వాటా విడుదల చేసేలా ఒత్తిడి తేవాలని, రబీ వ్యవసాయంలో మరింత వృద్ధి సాధించాలని ఆయన సూచించారు.