మానవహక్కుల కమిషన్ ఏం చెప్పింది డిజిపి సారూ!?


అమరావతి: రాష్ట్రంలో పర్యటించిన జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు విచారణ నివేదిక వెల్లడించకముందే డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని చెప్పడాన్ని టిడిపి నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిజిపికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక పంపిందా అని ప్రశ్నించారు. ఎవరికీ కాపీ ఇవ్వకుండానే తమరు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులే గుంటూరు జిల్లా వచ్చిన సమయంలో భయపడ్డారనీ, బాధితులు స్వేచ్చగా చెప్పుకునే అవకాశం లేదని సభ్యలే ఆనాడు చెప్పారనీ వర్ల అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని తాము ఆరోపించామన్నారు. ఫిర్యాదుదారులకు కూడా నివేదిక రాకుండా డిజిపి ప్రకటించడం‌ సరి కాదని వర్ల అన్నారు.

టిడిపి వారిపై అక్రమంగా కేసులు పెట్టవద్దని డిజిపిని కోరామన్నారు. మాచర్ల సిఐపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వర్ల అన్నారు. సిఐ తప్పుందని తేలినా ‌కనీసం బదిలీ కూడా చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడుల వల్ల సిఐని మార్చలేకపోతున్నారా అని వర్ల ప్రశ్నించారు. విచారణ జరిగే సమయంలో అయినా తప్పించకపోతే, ఆ విచారణకు అర్థం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను మాజీ సిఐగా మాట్లాడటం లేదనీ, టిడిపి పాలిట్ బ్యూరోగా అడుగుతున్నాననీ ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తను కొడుతూ, లైవ్ వీడియోను వైసిపి నేతలకు పోలీసులే చూపించారనీ వర్ల ఆరోపించారు. చిలకలూరిపేట వద్ద జరిగిన ఈ ఘటనపై డిజిపి విచారణ చేయించారా అని ప్రశ్నించారు.

చింతమనేని పట్ల  కక్ష సాధింపుతో వ్యవహరించడం అన్యాయమని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప బెయిల్ రాకుండా కుట్రలు చేయడం మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో‌ వాస్తవ పరిస్థితులు తమరి దృష్టికి తీసుకు‌వస్తున్నాం, స్పందించండి అని డిజిపిని ఉద్దేశించి అన్నారు.

ఎపి వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందంటారు, మళ్లీ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయంటారు, అన్నీ సక్రమంగా ఉంటే 144 సెక్షన్ ఎందుకని వర్ల ప్రశ్నించారు. ఇప్పటికైనా చట్ట ప్రకారం నడుచుకునేలా సిబ్బందికి డిజిపి ఆదేశాలు ఇవ్వాలని వర్ల కోరారు.

‘ప్రజా స్వామ్యం అంటే,‌ నా‌శత్రువు నోరు నొక్కే బలం, బలగం‌ అధికారం నాకున్నా నేను ఆపని చేయను. నా శత్రువు స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇస్తా’ అని అబ్రహం లింకన్ అన్నారని వర్ల గుర్తు చేశారు.

నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. జివో 2430 ద్వారా ప్రభుత్వం మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుందని వర్ల విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ, రాక్షస పాలన సాగుతుందని ఆయన దుయ్యబట్టారు.