ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం జరగడం కలకలాన్ని రేపింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఆర్మూరు నియోజకవర్గ పరిధిలోని ముక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ గా గుర్తించారు. ప్రసాద్ గౌడ్ భార్య లావణ్య గ్రామ సర్పంచ్ కాగా ఆమెను సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ప్రసాద్ గౌడ్ కక్ష పెంచుకున్నాడు. జీవన్ రెడ్డిని అంత మొందించాలని పథకం రచించుకున్నాడు ప్రసాద్ గౌడ్.
ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఇంటిలోకి సోమవారం రాత్రి ప్రవేశించాడు. ఎమ్మెల్యే నివాసంలోకి వెళ్లిన ప్రసాద్ గౌడ్ మూడవ ఫ్లోర్ లోకి వెళ్లి ఎమ్మెల్యే బెడ్ రూమ్ డోర్ తీశాడు. ఆ సమయంలో జీవన్ రెడ్డి మేల్కొని ఉండటంతో పాటు నిందితుడిని చూసి కేకలు వేయడంతో అతను పరారైయ్యే ప్రయత్నం చేశాడు. ఈ తరుణంలో జీవన్ రెడ్డి సిబ్బంది అతన్ని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు ప్రసాద్ గౌడ్ వద్ద నుండి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలోని సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అర్మూరు నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది.