NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

JP Nadda: ‘కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతాం’

Share

JP Nadda: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో జోరు పెంచింది. అగ్రనేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జేపీ నడ్డా నారాయణపేట, చేవెళ్ల లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ మోడీ పాలనలో ప్రగతి, బీజేపీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తారు అనేది వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసిఆర్ అవినీతి కక్కిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలను రూపుమాపుతామని అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వారసత్వ రాజకీయాలపై పోరాడుతున్న పార్టీ బీజేపీయేనని అన్నారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఏన్నో స్కీమ్ లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే కేసిఆర్ ఆ ప్రయోజనం ప్రజలకు అందకుండా చేశారని నడ్డా విమర్శించారు. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఓట్ల కోసమే ఇక్కడ ఉర్దూ కు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందలేదన్నారు. కేంద్రంలో మోడీ చెప్పిన పనులన్నీ చేశారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని చెప్పారు. అక్కడ ఏ పథకాలూ అమలు కావడం లేదని, అక్కడ ఇచ్చిన ఒక్క గ్యారెంటీ ని అమలు చేయలేదని అన్నారు. ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీలు ఇస్తామని ఆ పార్టీ చెబుతోందనీ, వాటిని నమ్మవద్దని అన్నారు.

తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ తెలంగాణలో రూ.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని నడ్డా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిస్తే ఉజ్వల్ వినియోగదారులకు ఉచితంగా నాలుగు సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ ఈ తొమ్మిదేళ్లలో ఎంత మందికి రెండు పడకల ఇళ్లు ఇచ్చిందో ఆలోచించాలన్నారు. మోడీ పాలనలో భారత్ ప్రపంచంలోనే అయిదవ ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో తొలి సారిగా బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని తెలిపారు. బీజేపీ గెలిపిస్తే వరికిరూ.3వేల మద్దతు ధర కల్పిస్తామనీ, ఎరువుల కోసం రూ.2100 ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు.

Barrelakka: కొల్లాపూర్ ఎన్నికల బరిలో నిరుద్యోగ యువతి బర్రెలక్క ..బర్రెలక్క సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ .. ప్రధాన పార్టీ అభ్యర్ధుల గుండెల్లో గుబులు


Share

Related posts

నిరుపేదలకు రూపాయికే కడుపునిండా భోజనం!!!

Naina

vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగబోదన్న కేంద్రం !ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టీకరణ!

Yandamuri

BJP Janasena Alliance: జనసేనకు సీట్లు ఫిక్స్ ..? నేడు ఫైనలైజ్ చేయనున్న బీజేపీ అధిష్టానం

somaraju sharma