ఆయనే రోగం… ఆయనే మందు…!
ఆయనే పాపం… ఆయనే ఫలితం…!
ఆయనే దెయ్యం… ఆయనే భయం…!
ఆయనే వైరస్… ఆయనే వాక్సిన్…!
“నువ్వు రోగివి.., నువ్వు దద్దమ్మవి… నువ్వు సన్నాసివి” ఇలా ఎన్ని అన్నా నవ్వుతూ మరిన్ని తిట్టించుకునే వింత జీవి “ఆర్జీవీ”…! ఆయన సినిమాల్లో మ్యాటర్ ఉండదు, కానీ వివాదం ఉంటుంది. అందుకే అంత హైప్, అంత పేరు. తిట్టుకున్నా, కోపంగా ఉన్నా వర్మ సినిమా అంటే పైరసీగా అయినా చూడాలని తాపత్రయం ఉంటుంది ఆయన అభిమానులకు, వ్యతిరేకులకు కూడా…! తనను తనకంటే మరింతగా ఎవరూ బాగా తిట్టలేరనేది వర్మ స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే తనను తిట్టుకుంటూ తనే సినిమాలు తీసుకోవాలన్నా సిద్ధమే, పాటలు రాసుకోవాలన్నా సిద్ధమే. “ఎదుటి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టినప్పుడు తన జీవితంలోకి ఎదుటి వాళ్ళు వేళ్ళు పెడతారు… అందుకు సిద్ధమై వచ్చి… ఇన్ని దిక్కుమాలిన సినిమాలు తీస్తున్నవాడే వర్మ”…! అటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రాష్ట్రంలో ఓ కుంపటి రాజేశారు.
ఏం చేసైనా వర్మ లక్ష్యం సాధించే తత్వం…!!
రాష్ట్రంలో జనసేనకు రాజకీయంగా పెద్దగా బలం లేకపోవచ్చు కానీ, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద బలగం ఉంది. అందుకే వర్మకు గతంలో ఎదురవ్వని పెద్ద ప్రతి సవాళ్లు ఎదురవుతున్నాయి.
వర్మకి వివాదాల జోలికి వెళ్లడం ఇది మొదటిసారి కాదు, ఇదే చివరి సారి కాబోదు. ఆయన తత్వం అది. గంటలో స్టోరీ రాసేసి, పది రోజుల్లో సినిమా తెరకెక్కించేసి.., 12 వ రోజున ఎలాగోలా రిలీజ్ చేసెయ్యగల సత్తా ఉంది. అది జనం చూసినా, చూడకపోయినా… తనను తిట్టుకున్నా, చీదరించుకున్నా… అంతిమంగా సినిమా లక్ష్యం “బిజినెస్” మాత్రం జరుగుతుంది. తన లక్ష్యం డబ్బు. వ్యాపారం, సినీ మోజు. ఎదుటి వాళ్ళని కెలకడం..! అది మాత్రం శతశాతం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా సినిమా సేఫ్ కి వెళ్తుంది. అదే వర్మ తత్వం. అందుకే తాను ఎవ్వర్నీ వదలడు. అయితే ఇప్పుడు వరుసగా వైసీపీ వ్యతిరేకులపై సినిమాలు తీస్తున్నాడు అంటే వైసిపిలో ఎవరైనా పెద్దలు సాయం చేస్తే చేసి ఉండొచ్చు, అది తర్వాత విషయం కానీ… వర్మ లక్ష్యం సినిమా, హైప్, వ్యాపారం…! దానిలో భాగంగా ఈరోజు ట్రైలర్ కూడా విడుదల చేసి హైప్ పెంచారు. మ్యాటర్ లేకపోయినా అది వివాదం కాబట్టి చూస్తారు. అదే వర్మ లాజిక్. అందుకే వర్మ ఒక వైరస్, వర్మ ఒక వాక్సిన్.
పవన్ ఫ్యాన్స్ ఎంత వరకు వెళ్తారో…!!
గతంలో లేని విధంగా ఇప్పుడు వర్మకి పవన్ ఫ్యాన్స్ నుండి గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇవేమి వర్మకి పెద్ద లెక్క కాదు. కానీ వీళ్ళు ఎంత వరకు నిలబడతారు అనేది ముఖ్యం. వర్మ గతంలో అనేక సినిమాలు తీయడం.. వాటికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు ప్రకటించి ఆపేయడం కూడా జరిగింది. వర్మ గత ఏడాది “లక్ష్మీస్ ఎన్ఠీఆర్” ప్రకటించినప్పుడు… కేతిరెడ్డి అనే ఒక నిర్మాత, డైరెక్టర్ “వర్మ నేను నీకు పోటీగా లక్ష్మీస్ వీరగంధం” తీస్తాను అంటూ షూటింగ్ మొదలెట్టారు. అది అక్కడే ఉంది, కానీ వర్మ సినిమా వచ్చింది, పోయింది, ఎన్ని జరిగిపోయాయి. ఇలా వర్మకి వ్యతిరేకంగా సినిమాలు తీయడం సులువే, కానీ సినీ మార్కెట్ లో నిలదొక్కుకోవడమే కష్టం. మరి జనసేన అభిమానులు, పవన్ ఫ్యాన్స్ తీస్తున్న “పరాన్నజీవి” ఎంత వరకు వస్తుందో చూడాల్సి ఉంది.