Friends: మనకు జీవితంలో మంచి స్నేహితులు దొరకడం అనేది చాలా కష్టం. ఒకసారి దొరికాక విడిపోకుండా ఉండగలగడం మనం స్నేహితుడికి,స్నేహానికి ఇచ్చే నిజమైన విలువ. అందుకే యుక్తాయుక్త వివేచనతో స్నేహబంధం ఏర్పరచుకోవాలి. ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకు మనసు చివుక్కు మనకుండా వ్యవహరించాలి.
స్నేహం చేసేటప్పుడు,చిన్న చిన్న ప్రయోజనాలు, స్వప్రయోజనాల కోసం చూసుకోకుండా, గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. విమర్శ చేస్తే అది మీకు కానీ మీ ఫ్రెండ్ కి కానీ మనసు వికలం కాకుండా ఉపయోగపడేలా ఉండేలా చూసుకోండి. తీయగా మాట్లాడేవాళ్లు, దగ్గరగా ఉండేవాళ్లు, కులాసాగా నవ్వుతూ కబుర్లాడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాలేరు. మనసంతా ద్వేషం నింపుకొని, పైకి మాత్రం సానుకూలంగా, సన్నిహితంగా కనిపించే వారెందరో ఉంటారు మన చుట్టూ. మన ముందు పొగడుతూ చాటుగా విమర్శించే వారు కూడా చాలా మందే ఉంటారు. నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించే వాళ్ళ సంగతి కూడా చెప్పక్కరలేదు . మేకవన్నె పులులు వంటి వారు వీళ్ళు .మంచి చెప్పేవాడు కఠినం గా అనిపించినా మన మంచి కోసం తపించేవారు, నిజాన్ని మొహమాటం లేకుండా చెప్పేవారు నిజమైన ఫ్రెండ్స్ . పాపపు పనులు చేయనీయకుండా, మంచి చెబుతూ ,మంచి పనులు చేసేలా చూస్తూ, రహస్యాలను చాలా గోప్యంగా ఉంచుతారు.
మీ చెడ్డ గుణాలను సరిచేస్తూ, మంచి గుణాల ను అందరికీ తెలియజేస్తూ, ఆపద సమయాల్లో అండగా ఉండటం తో పాటు , అవసరానికి ఆదుకొని ఎప్పటికప్పుడు సాయపడుతూండేవారే మంచి స్నేహితులు. . స్నేహబంధం కష్టం ఇష్టం అవుతుంది. దుఃఖం ,సుఖం గా మారుతుంది . ఒకరి కోసం మరొకరు గా జీవించాలి. మీరు స్నేహం చేసిన అలాగే చేయండి… స్నేహితులుగా కూడా అలాంటి వారిని ఎంచుకోండి..