రాక్ స్టార్ మీద మీటూ ఆరోపణలు
మెక్సికో సిటీ: మెక్సికన్ రాక్ బ్యాండ్ బోటెలిటా డీ జెరెజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాక్ స్టార్ అర్మాండో వెగా గిల్ (64) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బాలికను లైంగికంగా వేధించినట్లు తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మెక్సికోలోని తన ఇంట్లో అతడు మరణించి కనిపించినట్లు అధికారులు తెలిపారు.
తాను 13 ఏళ్ల వయసులో ఉండగా గిల్ తనను వేధించాడని ఒక మహిళ ట్విట్టర్ ద్వారా ఆరోపించింది. ఇది తప్పుడు ఆరోపణ అని వెగా గిల్ తన లేఖలో చెప్పాడు. తాను చనిపోతున్నంత మాత్రాన తాను తప్పు చేసినట్లు కాదని, తన నిర్దోషిత్వానికి నిదర్శనం మాత్రమేనని అన్నాడు. భవిష్యత్తులో తన కొడుకు నడవబోయే మార్గాన్ని క్లియర్ చేయాలన్నదే తన కోరిక అని చెప్పాడు. గిల్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో మరణించగా, అందుకు రెండు గంటల ముందే తాను అతడితో మాట్లాడినట్లు బ్యాండ్ ప్రతినిధి పౌలా హెర్నాండెజ్ తెలిపారు. అతడు అప్పటికి చాలా విషాదంలో ఉన్నాడని, తన మీద వచ్చిన చెడ్డపేరు ఎలా తుడిచేసుకోవాలా అని బాధపడ్డాడని చెప్పారు. తన కొడుకు మీద ఇదంతా పడుతుందేమోనని ఆందోళనకు గురయ్యాడన్నారు.
No se culpe a nadie de mi muerte: es un suicidio, una decisión voluntaria, consciente, libre y personal. #MeeToMusicosMexicanos pic.twitter.com/pEXVf6beFn
— Armando Vega Gil (@ArmandoVegaGil) April 1, 2019
మెక్సికో సోషల్ మీడియాలో వెగా గిల్ ఆత్మహత్య పెద్ద చర్చకు దారితీసింది. అతడు నిజంగా నిర్దోషి అయితే కోర్టులో నిరూపించుకోవాల్సిందని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం అతడు చేసింది నేరమేనని, శాశ్వతంగా తన పేరు మీద బురద చల్లుకున్నాడని మండిపడ్డారు.