(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సర్కస్ అంటే అందరికీ ఇష్టమే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ. సుశిక్షితులైన మనుషులు చేసే రకరకాల ఫీట్లతో పాటు జంతువులతో కూడా చేయించే సర్కస్ ఫీట్లు ఆనందం కలిగిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో జంతుహింస వ్యతిరేకత సమాజంలో ఎక్కువవుతోంది. అడవిలో హాయిగా ఉండే జంతువులను తీసుకొచ్చి మనిషి ఆనందం కోసం హింసించడమేమిటని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు.
ఫలితంగా నెదర్లాండ్స్, ఐరాల్డ్, మెక్సికో వంటి పలు దేశాలు సర్కస్లో జంతువులను ఆడించడం నిషేధించాయి. జర్మనీలో ఒక సర్కస్ యాజమాన్యం ఇంకాస్త ముందుకు వెళ్లి 3డి హోలోగ్రామ్ జంతువులతో ఆడించడం మొదలుపెట్టింది. చీకటిగా తయారయిన సర్కస్ గుడారంలో ఈ జంతువులు ఆడుతుంటే ప్రేక్షకులు చక్కగా ఆనందిస్తున్నారు. ప్రప్రధమంగా ఇలా 3డి హోలోగ్రామ్స్ జంతువులను ప్రవేశపెట్టిన ఆ సర్కస్ పేరు రొంకల్లి సర్కస్. బ్లూబాక్స్, ఆప్టోమా అనే రెండు కంపెనీల సహకారంతో ఈ హలోగ్రామ్స్ రూపొందించారు.