Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న చంద్రబాబుకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ మళ్లీ వాయిదా పడింది. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవేళ రెండు పిటిషన్లు విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీ విచారణ చేసిన సీఐడీ అధికారులు తమకు విచారణ లో చంద్రబాబు సహకరించలేదనీ, మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ పొడింపుతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పైనా ఒకే సారి వాదనలు విని ఆర్డర్స్ ఇస్తామని నిన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. తొలుత తమ పిటిషన్ విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు, ముందుగా కస్టడీ పిటిషన్ పై విచారణ జరపాలని సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న వాదోపవాదనలు చేశారు.

అయితే రూల్స్ ప్రకారం పిటిషన్ లపై విచారణ జరుపుతామని న్యాయమూర్తి నేటికి (మంగళవారం) విచారణను వాయిదా వేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఒక రోజు సెలవు పై వెళ్లారు. దీంతో ఏసీబీ కోర్టు ఇంఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి గా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారించాలని ఇన్ చార్జి న్యాయమూర్తిని కోరారు. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‍లో చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఇన్ చార్జి జడ్జి విచారణను రేపటికి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్‍పై ఇవాళ వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా, ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమనీ తాను రేపటి నుంచి సెలవుపై వెళ్లనున్నట్లు ఇన్ చార్జి న్యాయమూర్తి తెలిపారు. రేపు రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని ఇరుపక్షాలకు సూచించిన ఏసీబీ కోర్టు ఇన్ చార్జి న్యాయమూర్తి.. విచారణను రేపటికి వాయిదా వేశారు.

మరో పక్క చంద్రబాబు తరపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) బుధవారం విచారణకు రానుంది. చంద్రబాబు తరపున దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడి కానున్నది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ కింద గవర్నర్ నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు చేసి కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్ పై న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా నిన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించగా, ఇవేళ మెన్షన్ లిస్ట్ తో రావాలని సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేళ సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ లిస్ట్ అవకాశం లేకపోవడంతో, నేరుగా మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్నారు. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఎల్లుండి నుండి అక్టోబర్ 2 వరకూ సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు రిలీఫ్ లభిస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.