Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన బెయిల్, కస్టడీ పిటిషన్ల పై ఇటు ఏసీబీ కోర్టు, అటు ఏపీ హైకోర్టులోనూ విచారణలు వాయిదా పడ్డాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషనన్ పై ఇవేళ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (వర్చువల్ గా), సీఐడీ తరుపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనుల వినిపించారు.

చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ వాదనలు వినిపించారు. ఈ స్కామ్ లో చంద్రబాబు కుటుంబానికి లబ్దిచేకూరిందన్నారు. ఏ కేసుకు ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. ఒక కేసులో అరెస్టు అయితే అన్ని కేసుల్లో అరెస్టు అయినట్లు కాదని, ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదన్నారు. మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చని అన్నారు. ఈ అంశానికి సంబంధిచిన పలు తీర్పులను న్యాయమూర్తి కి ఏజీ శ్రీరామ్ అందజేశారు. తిరిగి వాదనలు సెప్టెంబర్ 29వ తేదీ మధ్యాహ్నం వింటామని ధర్మాసనం తెలిపి వాయిదా వేసింది.

మరో పక్క ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసులో బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఇప్పటికే రెండు రోజుల పాటు కస్టడీ విచారణ చేసిన సీఐడీ .. తమకు విచారణ లో చంద్రబాబు సహకరించలేదనీ, మరో అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కస్టడీకి ఇస్తే కేసు లో పూర్తి కుట్ర కోణం బయటపెడతామని ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేయాలని భావిస్తున్నట్లు న్యాయమూర్తి తెలపగా కస్టడీ పై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు. విచారణను వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. శుక్రవారం వాదనలు వినిపిస్తామని తెలిపారు. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిటిషన్ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని కోరతారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు, విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని ప్రశ్నించారు న్యాయమూర్తి, కోర్టు సమయం వృధా ఎందుకు చేస్తున్నారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎంత కాలం పిటిషన్ ను పెండింగ్ లో ఉంచాలని ప్రశ్నిస్తూ లిఖిత పూర్వక మెమో దాఖలు చేయాలన్నారు. అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. రెండు పిటిషన్లపై ఒకే సారి వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. వాదనలు విన్న తర్వాత ఒకే సారి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు. అదే విధంగా అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్ల పై విచారణను కూడా విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు లో క్వాష్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా..?