Chandrababu Arrest: ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. కోర్టు విచారణ జరిగే వరకూ అరెస్టు చేయవద్దన్న అభ్యర్ధనను పొడిగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోరారు. దీంతో అప్పటి వరకూ అరెస్టు చేయవద్దన్న అభ్యర్ధనను అంగీకరించాలని సుప్రీం కోర్టు సూచించింది.

ఒక వైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో 17ఏ పై వాదనలు కొనసాగుతుండటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ శుక్రవారం చేపడతామని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు దాఖలు చేసిన స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్, ఫైబర్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ జరిపింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపించారు. తదుపరి చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా కౌంటర్ వాదనలు వినిపిస్తున్నారు.
మరో పక్క ఏపీ హైకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్ధన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్న హైకోర్టు తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు గత నెల 10వ తేదీ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు. మరో మూడు కేసులు చంద్రబాబుపై నమోదు కాగా అంగళ్లు కేసులో మాత్రం ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రావాల్సి ఉంది.