E Challan Scam: పోలీస్ శాఖలో రూ.36.58 కోట్ల ఈ – చలానా కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ కొమ్మిరెడ్డిని ఎట్టకేలకు గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల పేరుతో ప్రజల నుండి జరిమానాల రూపంలో వసూలు చేసిన మొత్తంలో రూ.36.53 కోట్లు దారి మళ్లించిన వ్యవహారంపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
గత నెలలో డాటా ఇవాల్వ్ సంస్థలో పని చేస్తున్న కొత్తపల్లి రాజశేఖర్ ను అరెస్టు చేశారు. ఈ స్కామ్ లో మాజీ డీజీపీ అల్లుడు అవినాష్ కొమ్మిరెడ్డి, ఆయన చెల్లెలు అక్షిత, రవికిరణ్ అనే మరో వ్యక్తిని కీలక నిందితులుగా గుర్తించారు. 2018 డిసెంబర్ లో ఈ చలాన్ వసూళ్లకు సంబంధించి రూ.2 కోట్లు చెల్లించే విధంగా పోలీస్ శాఖ ఓపెన్ టెండర్ పిలిచింది. ఇందులో కృష్ణా సొల్యూషన్ సంస్థ ఏడాదికి రూ.1.97 కోట్లు కోట్ చేయగా, డాటా ఇవాల్వ్ సంస్థ మాత్రం ఒక్క రూపాయి మాత్రమే కోట్ చేసి దక్కించుకుంది.
ఆ తర్వాత వాహన దారుల నుండి వసూలు చేసిన ఈ చలాన్ సొమ్మును రూ.36.53 కోట్లు కొల్లగొట్టారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లుగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు మంగళవారం మీడియాకు తెలిపారు. అమెజాన్ క్రౌడ్ సర్వీసెస్ కొనుగోలు చేసిన అవినాష్ .. వాటిని వేరే కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా డబ్బులు మళ్లించారని వెల్లడించారు.
నిందితులకు సంబంధించిన మొత్తం 16 ఆస్తులను జప్తు చేశామని, వాటి విలువ రూ.13 కోట్లు ఉంటుందని తెలిపారు. దారి మళ్లించిన సొమ్ముతో ఒంగోలు, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో స్థలాలు కొనుగోలు చేశారనీ, బ్యాంకులో ఎఫ్ డీ ఆర్ లు చేసినట్లు వివరించారు. ఈ కుంభకోణానికి సంబంధించి సమగ్ర విచారణకు అంతర్గత కమిటీని వేసినట్లు పాలరాజు చెప్పారు.
Barrelakka Sirisha: స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్క టీమ్ పై దాడి ..కొల్లాపూర్ లో టెన్షన్
Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రూ.2 వేల కోట్లు ఇస్తే అంటూ సంచలన వ్యాఖ్యలు..