NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

Share

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (క్వాష్ పిటిషన్) పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ కేసు విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వర్చువల్ గా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టుకు అవసరమైతే లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తానని హరీష్ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని సుప్రీం కోర్టు ధర్మాసనం అంగీకరించింది.

ప్రభుత్వ తరపు న్యాయవాది రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 17ఏ వర్తించదని అన్నారు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదనీ, 17ఏ సెక్షన్ అధికార నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ చత్రం కాకూడదని, ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు  తీసుకునే వాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారన్నారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని రోహత్గీ వాదించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా విచారించే అధికారి ప్రత్యేక కోర్టులకు ఉంటుందని, అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారన్నారు.

న్యాయపరిధికి సంబంధించి వివాదం లేదనీ, ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందన్నారు. వందల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 422 సీఆర్పీసీ కింద క్వాష్ చేయలేమని అన్నారు. ఆరోపణలు ఉన్నప్పుడు చార్జిషీటు చేసి విచారణ జరిపి శిక్ష కూడా వేయవచ్చు అని రోహత్గీ వాదించారు. దీనిపై జస్టిస్ త్రివేది స్పందిస్తూ ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలగుతామా అని ప్రశ్నించారు. అవినీతి కేసులో 17ఏ చంద్రబాబుకు వర్తించినా మిగతా సెక్షన్స్ లో వర్తించదని రోహత్గీ వాదించారు. పలు కోర్టు తీర్పులను రోహత్గీ ఉటంకించారు. అవినీతి కేసులతో పాటు మిగతా సెక్షన్ ల కింద కేసులు నమోదైనప్పుడు వాటన్నింటినీ కలిపి ప్రత్యేక కోర్టు విచారించవచ్చని రోహత్గీ పేర్కొనగా, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు కదా.. ఈ దశలో చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని రోహత్గీని ధర్మాసనం ప్రశ్నించింది.

సెక్షన్ 19 కింద కోర్టు అనుమతి లేకపోతే విచారించలేమని, అందుకే అరెస్టు చేశామని రోహత్గీ వాదించారు. సుప్రీం లోనే అంతా తేలాలని ఈ దశలో చంద్రబాబు తరపు లాయర్లు కోరడం సమంజసం కాదని ముకుల్ రోహత్గీ అనగా, ఏదో ఒక రోజు మీరు కూడా అదే విధంగా కోరే అవకాశం ఉందని ముకుల్ రోహత్గీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చింది, చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాత నేర మంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉందని జస్టిస్ బోస్ ప్రశ్నించారు. ఈ కేసులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదని, కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని రోహత్గీ కోరారు.

చంద్రబాబు తరపు హరీష్ సాల్వే .. చట్టసవరణను ముందు నుండి వర్తింపజేసే అంశంపై పలు తీర్పులను ఉటంకిస్తూ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసు, 1964 నాటి రతన్ లాల్ కేసును ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, రాజకీయ కక్షసాధింపులను నిరోధించేందుకే 17ఏ ఉందన్నారు. సెక్షన్ 17 ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందన్నారు. ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదనీ, రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయన్నారు. విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తొందని సాల్వే వాదించారు.

మొదట్లో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరులే దనీ, రిమాండ్ సమయంలో ఆయన పేరు చేర్చారన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుందని అన్నారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారని, కోర్టు సెలవుల దృష్ట్యా దయ చేసి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సాల్వే ధర్మాసనాన్ని కోరారు. అయితే మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. శుక్రవారం ఇరుపక్షాల లాయర్లు లిఖిత పూర్వక వాదనలు అందజేయనున్నారు. అయితే తీర్పు రిజర్వ్ చేయడంతో కోర్టు సెలవుల కారణంగా దసరా సెలవుల తర్వాతే వెల్లడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో విచారణ వాయిదా.. అప్పటి వరకూ అరెస్టు చేయొద్దంటూ ఆదేశం


Share

Related posts

Intinti Gruhalakshmi: తులసికి వరుస షాక్స్.. ఎస్సై ప్లాన్స్ భలే తిప్పికొట్టిందిగా..! ఇది కదా అసలు ట్విస్ట్.!?

bharani jella

ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువవుతాయట..!!

bharani jella

కేసీఆర్ షాక‌య్యేలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశారంటే?

sridhar