TDP MLC: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిక్లరేషన్ వివాదం పరిష్కారం అయ్యింది. డిక్లరేషన్ కోసం అర్ధరాత్రి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం, అభ్యర్ధి రాంగోపాల్ రెడ్డి సహా టీడీపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం తెలిసిందే. మరో వైపు డిక్లరేషన్ జారీలో ఆలస్యంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖపై కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి ఎమ్మెల్సీగా గెలుపొందిన రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తగు సూచనలు చేసింది.

డిక్లరేషన్ స్వీకరించేందుకు ఆర్ఓ కబురు చేయడంతో అభ్యర్ధి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి చేతుల మీదుగా రాంగోపాల్ రెడ్డి డిక్లరేషన్ స్వీకరించారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, నాయకులు పరిటాల శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.