టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద బడ్జెట్ సినిమాల కంటే.. చిన్న సినిమాల సక్సెస్ రేట్ బాగుందని చెప్పాలి. కథ, కథనాలు ఎంత ముఖ్యమో.. దర్శకుడి విజన్ కూడా అంతే ముఖ్యం. అలా.. దర్శకుడి టాలెంట్ తో ఈమధ్య టాలీవుడ్ ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు వచ్చి సక్సెస్ అయినవి ఉన్నాయి. అలా చిన్న సినిమాగా వచ్చి సక్సెస్ అయిన సినిమాల్లో గత ఏడాది వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా ఒకటి. థ్రిల్లర్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఆ మూవీకి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు స్వరూప్ RSJ. ఇప్పుడు మలి ప్రయత్నంగా మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు.
‘మిషన్ ఇంపాజిబుల్’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన టైటల్, సినిమా థీమ్ ను వివరిస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు. టైటిల్ లోనే క్యూరియాసిటీ నింపాడు. ఇంగ్లీషులో Mission impossible అనే పదాన్ని ఇస్తూనే.. అందులోని Mission లో sio అనే అక్షరాలను కొట్టేసి ha అనే అక్షరాలతో Mishan Impossibleగా చేర్చాడు. దీంతో.. సినిమా టైటిల్ ‘మిషన్ ఇంపాజిబుల్’ అయినా ఇంగ్లీషు స్పెల్లింగ్ మార్చేశాడు. పోస్టర్లో ముగ్గురు పిల్లలను ఆంజనేయస్వామి, శివుడు, శ్రీకృష్ణుడు గెటప్స్ లో చూపించాడు. పైగా.. వారి చేతుల్లో గన్స్ పెట్టాడు. వెనుక పల్లెటూరి ఇళ్లు, వాతావరణాన్ని, గుడిని ప్రజెంట్ చేశాడు. ఒక గోడ మీద ‘వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్’ అనే పోస్టర్ పై చిన్న పిల్లాడి బొమ్మ బ్లర్ చేసి ఉంది.
దీంతో సినిమాపై చాలా ఆసక్తి రేపాడు దర్శకడు స్వరూప్ ఆర్ఎస్ జె. మొదటి సినిమానే థ్రిల్లర్ గా తెరకెక్కించి ఆకట్టుకున్న దర్శకుడు ఈ సినిమాను అదే జోనర్ లో తెరకెక్కిస్తున్నాడా.. లేక మరో వినూత్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు పూజా కార్యక్రమం జరిగిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కాబోతోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.