‘షోయూ’ గురించి అనేక విషయాలు తెలియజేసిన నాగచైతన్య
తెలుగు సినిమా రంగంలో ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలు చేసే హీరోలు లిస్ట్ చాలానే ఉంది. ఇప్పుడు ఇదే కోవలోకి ఈ ఏడాది ప్రారంభంలో అక్కినేని నాగచైతన్య చేరడం జరిగింది. సమంతాతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టిన నాగచైతన్య విజయవంతంగా రాణిస్తున్నారు.

‘షోయూ’ పేరుతో ఓ ప్యాన్ ఏషియన్ డెలివరీ బ్రాండ్ రెస్టారెంటును ప్రారంభించిన నాగచైతన్య .. తాజాగా ఓ సోషల్ మీడియా యాంకర్ కి’షోయూ’ క్లౌడ్ కిచెన్ బిజినెస్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘షోయూ’ కిచెన్ లోనే ఈ ఇంటర్వ్యూ జరిగింది. వాస్తవానికి లాక్ డౌన్ సమయంలో రెస్టారెంట్ పెట్టాలని ఆలోచన వచ్చిందని నాగచైతన్య తెలిపారు.

ఆ సమయంలో కరోనా పరిస్థితులు బట్టి రెస్టారెంట్ ఆలోచన పక్కన పెట్టేసి… పాన్ ఏషియాన్ ఫుడ్.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ గురించి ఆలోచించడం జరిగిందని చైతు తెలిపారు. ఈ కాన్సెప్ట్ ద్వారా పాన్ ఏషియాలో సకల రుచుల ఫ్లేవర్ లను మన వాళ్ళకి అందించాలన్నదే ఉద్దేశం అని నాగ చైతన్య స్పష్టం చేశారు. ‘షోయూ’ అంటే సాయ్ సాస్ అని స్పష్టం చేశారు.
జపనీస్ రెస్టారెంట్ .. చైనీస్ వంటకాలతో కూడిన ఈ బిజినెస్ లో రకరకాల ఫ్లేవర్ లను అందించనున్నట్లు తెలిపారు. ఈ బిజినెస్ లో ప్యాకింగ్ చాలా స్పెషాలిటీ అని అన్నారు. ఇదే సమయంలో తన ఇంటిలో నానమ్మ గారు చేసే ఆవకాయ అంటే చాలా ఇష్టం అని నాగచైతన్య తెలిపారు.

ఇంటిలో కీమా వంటకంతో పాటు అన్ని రకాల ఫ్రైలు… ఇంకా రసం, పప్పు చారు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. పాఠశాల చదువుతున్న రోజులలో చెన్నై టిఫిన్ లు అంటే చాలా ఇష్టం అని.. ముఖ్యంగా మధురై ప్రాంతాలలో వంటకాలు అంటే కూడా ఇష్టమని నాగచైతన్య స్పష్టం చేశారు. జపాన్ డిషెస్, ఇండియన్ సి ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమని నాగచైతన్య ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
`లాల్ సింగ్ చడ్డా` గురించి ఇంకా అనేక విషయాలు నాగ చైతన్య తెలియజేశారు. ఇంకా అమెజాన్ ప్రైమ్ లో హార్రర్ తరహాలో వెబ్ సిరీస్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో బై లంగ్వల్ సినిమా చేస్తున్నట్లు తెలిపారు.

‘షోయూ’ క్లౌడ్ కిచెన్ ద్వారా డైరెక్ట్ గా ఆర్డర్ చేయాలంటే 90101, 90112 డయల్ చేయాలని కోరారు. ‘షోయూ’ కిచెన్ క్లౌడ్ కాన్సెప్ట్ హైదరాబాద్ లో మరికొన్ని చోట్ల బేగంపేట్ ఇంకా విమానాశ్రయ ప్రాంతాలలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు నాగచైతన్య ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.