లీకైన సినిమాతో పవన్ ప్రభంజనం.. ‘అత్తారింటికి దారేది’కి 7 ఏళ్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో ‘అత్తారింటికి దారేది’కి ప్రత్యేక స్థానం ఉంది.  సగం సినిమా ల్యాబ్ నుంచే లీకైపోయిన సంక్షిష్ట పరిస్థితుల్లో రిలీజై కూడా ఇండస్ట్రీ హిట్ సాధించింది. లీకులు చాలా సినిమాలకు జరిగాయి కానీ.. ఏ సినిమాకు కూడా ఈ స్థాయి విజయం మాత్రం సాధ్యం కాలేదు. అంతా.. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ కారణమని చెప్పాల్సిందే. పవన్ సినిమా లీకైంది అనే మాటే.. సినిమాపై క్రేజ్ పెంచేసింది. అసలే అంచనాలు ఉన్న సినిమాకు లీకైన సగం సినిమా అప్పటికే కిక్ ఇచ్చేసింది. ఈ పరిస్థితుల్లో విడుదలైన ‘అత్తారింటికి దారేది’ సంచలనాలు నమోదు చేసింది. నేటితో ఆ సంచలనానికి 7 ఏళ్లు.

pawan kalyan magical attarintiki daredi completes 7 years
pawan kalyan magical attarintiki daredi completes 7 years

సమైక్యాంధ్ర ఉద్యమ హోరులో.. కలెక్షన్ల తుఫాను..

ఈ సినిమా విడుదలయ్యే సమయానికి తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం, ఆంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న ఉద్యమాలతో రెండు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ‘అత్తారింటికి దారేది’ ఎప్పుడు విడుదలవుతుందో తెలీని పరిస్థితి. ఈ సమయంలో ‘లీక్’ దెబ్బ యూనిట్ కు శరాఘాతంలా తగిలింది. సెప్టెంబర్ 24న ఎడిటింగ్ రూమ్ నుంచే సినిమా బయటకు వచ్చేసింది. ఆందోళనతోనే సెప్టెంబర్ 27న సినిమా విడుదల అని ప్రకటించేశారు నిర్మాత భోగవల్లి ప్రసాద్. కానీ.. నిర్మాత, దర్శకుడు త్రవిక్రమ్, హీరో పవన్ లో ఆందోళన ఉండనే ఉంది.

అంచనాలకు అందని అద్భుత విజయం..

రాష్ట్రంలో దాదాపు అందరి సెల్ ఫోన్లలో సినిమా ఉండిపోయింది. సగం సినిమా చూసేశారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 27న తెల్లవారుఝామున చీకట్లు తొలగకముందే షోలు పడిపోయాయి. పవన్ ఫ్యాన్స్ హంగామా షరా మామూలే. ఆందోళన, ఆనందం కలగలిపిన భావోద్వేగాలతో సినిమా చూసిన ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగిపోయింది. సినిమా అద్భుతంగా ఉండటంతో సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అక్కడ మొదలైన ప్రభంజనం ఏకంగా ఇండస్ట్రీ హిట్ వరకూ వెళ్లిపోయింది. 2009లో మగధీర సృష్టించిన రికార్డులను తుడిచిపెట్టేసి.. అదే మగధీర తర్వాత 100 కోట్ల మైలురాయి అందుకున్న సినిమాగా నిలిచింది.