Premalu: ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం లేదా డబ్ చేసి విడుదల చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి. ఈ నేపథ్యంలోనే ఇటీవల టాలీవుడ్ లో ఓ మలయాళ డబ్బింగ్ చిత్రం విడుదల అయింది. అదే ప్రేమలు. గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ఇది. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు.
భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. 2024 ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి వంద కోట్ల రేంజ్ లో వసూళ్లను అందుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రేమలు చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ డబ్ చేసి విడుదల చేశాడు.
ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా 2024 మార్చి 8న విడుదలైన ప్రేమలు చిత్రం తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేమలు సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొన్నారు. దీంతో రూ. 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ.. విడుదలైన నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. కేవలం మౌత్ టాక్ తోనే అద్భుతమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ తాజాగా తెలుగులో నయా రికార్డును సెట్ చేసింది. మలయాళ చిత్రాల పరంగా తెలుగులో అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న సినిమాగా ప్రేమలు మొదటి స్థానంలో నిలిచింది.
ఇది వరకు మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ చిత్రం తెలుగు లో మన్యం పులిగా విడుదలై రూ. 9.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను అందుకుని రికార్డు సృష్టించింది. ఈ రికార్డును టోవినో థామస్ యాక్ట్ చేసిన 2018 మూవీ బ్రేక్ చేసింది. తెలుగులో టోటల్ రన్ లో రూ. 10.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది. అయితే తాజాగా విడుదలైన ప్రేమలు 2018 రికార్డును అధిగమించింది.
తెలుగులో విడుదలైన పద్దెనిమిది రోజుల్లోనే ప్రేమలు చిత్రం రూ. 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. తెలుగులో మలయాళ స్టార్ హీరోల సినిమాలకు సాధ్యం కానీ సెన్సేషనల్ రికార్డును ప్రేమలు సొంతం చేసుకుని ట్రెండ్ సెట్ చేసింది. కాగా, ప్రేమలు సినిమా విషయానికి వస్తే..హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్. హైదరాబాద్‌లో ఐటీ జాబ్ చేసే ఇద్దరు మలయాళీ అమ్మాయిలకి.. గేట్ కోచింగ్ తీసుకుంటున్న ఇద్దరు మలయాళీ కుర్రాళ్లకి మధ్య నడిచే లవ్ స్టోరీనే ప్రేమలు. చాలా సింపుల్ కథను ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెండితెరపై గిరీష్ చూపించారు. దీంతో ఈ చిత్రం యూత్ కు పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!