Siddharth: ప్రైవసీ కోసం ఇటీవల కొందరు సినీ తారలు రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను సీక్రెట్ గా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహాం చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ప్రముఖ హీరో సిద్ధార్థ్ కూడా పెళ్లి పీటలు ఎక్కినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈయన తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మెడలో మూడు ముళ్లు వేశాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు అదితి రావు హైదరీ.
అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మహా సముద్రం చిత్రంలో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2021 లో విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైంది. కానీ మహాసముద్రం సినిమాతో ఏర్పడ్డ సిద్ధార్థ్, అదితి ల పరిచయం ప్రేమగా మారింది. చాలా కాలం నుంచి లవర్ లో ఉన్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. నేడు ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేసి సిద్ధార్థ్, అదితి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం శ్రీరంగపురం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం ఉదయం జరిగిందని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన పురోహితులు సంప్రదాయబద్దంగా సిద్ధార్థ్, అదితిల వివాహం జరిపించారు. చాలా రహస్యంగా జరిగిన ఈ పెళ్లి కార్యక్రమానికి మీడియాతో పాటు ఆలయ సిబ్బందిని కూడా ఆలయంలోకి రానివ్వలేదని జోరుగా వార్తలు వస్తున్నాయి.
వనపర్తి సంస్థానాధీశులు శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని కట్టించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితి రావ్ హైదరీ ఒకరు. అందుకే అదితి ఆ ఆలయంలో వివాహం చేసుకుందని అంటున్నారు. అయితే ఇంతవరకు సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరీ తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించలేదు. వీరి పెళ్లి ఫోటోస్ కూడా ఇంకా బయటకు రాలేదు. ఇకపోతే సిద్ధార్థ్ తో పాటు అదితికి కూడా ఇది రెండో వివాహమే.
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్.. 2003లో మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే పెళ్లైన కొంతకాలానికే సిద్ధార్థ్-మేఘన మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2006 నుండి విడివిడిగా నివసించిన ఈ జంట.. 2007 జనవరిలో విడాకులు తీసుకున్నారు. ఇక అదితి విషయానికి వస్తే.. రాజ కుటుంబంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగినింగ్ లోనే పెళ్లి పీటలెక్కింది. భారతీయ న్యాయవాది మరియు మాజీ నటుడు సత్యదీప్ మిశ్రాను 24 ఏళ్ల వయసులో అదితి వివాహం చేసుకుంది. 2009లో వీరి పెళ్లి సీక్రెట్ గా జరిగింది. అయితే పెళ్లి జరిగిన రెండేళ్లకే సత్యదీప్ మిశ్రాతో అదితి విడిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ తో సెకండ్ లైఫ్ ను స్టార్ట్ చేసింది.