ఆమ్లెట్ వేసిన తర్వాత కోడిగుడ్డు పెంకు చెత్తబుట్టలో విసురుతాం. ప్రపంచవ్యాప్తంగా కిచెన్ వ్యర్ధాలలో కోడిగుడ్డు పెంకుల వాటా లక్షలాది టన్నులు ఉంటుంది. ఈ పెంకు కాల్షియం కార్బొనేట్తో తయారవుతుంది. ఎముకల నిర్మాణంలో కీలకమైన పదార్ధం ఇది. అందుకే కొందరు గుడ్డు పెంకును మెత్తగా నూరి కాల్షియం సప్లిమెంట్ కింద తీసుకుంటారు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. గుడ్డు పెంకు ద్వారా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.
దెబ్బ తిన్న ఎముకల రీజెనరేషన్ కోసం కోడిగుడ్డు పెంకు ఉపయోగపడుతుందని ఇటీవల జరిగిన ప్రయోగాల తాజా ఫలితాలు చెబుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యుసెట్స్కి చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలు నిర్వహించారు. ప్రయోగ ఫలితాలను బయోమెటీరియల్ సైన్సెస్ జర్నల్లో ప్రచురించారు.
శాస్త్రవేత్తలు కోడిగుడ్డు పెంకులను మెత్తటి పొడిగా చేసి దానిని హైడ్రోజెల్ మిక్చర్కి కలిపారు. తద్వారా వచ్చిన జెల్ లాంటి పదార్ధం నుంచి ఎముకల కణజాలం ఉపయోగించి ఎముకలు రూపొందించారు. ఈ విధంగా రూపొందిన ఎముకలను విరిగిన ఎముకల స్థానంలో అతకవచ్చని వారు అంటున్నారు. ఎవరికైతే ఎముక అతకాలో వారి నుంచే ఎముక కణజాలం తీస్తారు కాబట్టి బయట తయారయిన ఎముకను శరీరం స్వీకరించే విషయంలో కూడా ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మొదట ప్రయోగశాలలో ఈ ప్రకియ అంతా చేసి చూశారు. తర్వాత ఎలుకలలో ప్రయోగించి చూశారు. మనుషులలో ఈ ప్రయోగాలు చేయడమే ఇక తరువాయని శాస్త్రవేత్తల బృందం నాయకురాలు కామ్సి ఉనాల్ పేర్కొన్నారు. దీనికి పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశామనీ, ఈ ప్రయోగ ఫలితాలు మనుషులకు అందుబాటులోకి వచ్చే రోజు దగ్గరలోనే ఉందనీ ఆమె అంటున్నారు.
Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.