గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న అన్న మీమాంస చాలా కాలం నుంచీ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం నివేదిక మంచిది కాదనే అంటున్నది.
ఆరు అధ్యయనాల్లో 30 వేల మంది అమెరికన్లను పరిశీలించిన తర్వాత ఈ నివేదిక రూపొందించారు. రోజుకు అదనంగా అర గుడ్డు తింటే గుండె జబ్బు ప్రమాదం ఆరు శాతం, అకాల మరణం ప్రమాదం ఎనిమిది శాతం పెరుగుతుందని తేల్చారు. గుడ్లు తినడం గుండెపోటుకు దారి తీస్తుందని చెప్పకపోయినా ఆ రిస్క్ పెరుగుతుందని ఈ అధ్యయనం సూచిస్తున్నది.
అయితే 1999లో అమెరికాలోనే మరో అధ్యయనం గుడ్డు తినడానికీ గుండె పోటు ప్రమాదానికీ సంబంధం లేదని తేల్చింది. 2013లో 30 లక్షల మంది ఆహారపు అలవాట్లు పరిశీలించిన ఒక బ్రిటిష్ అధ్యయనం కూడా అదే చెప్పింది. ఇటీవల చైనాలో నిర్వహించిన మరొక అధ్యయనం గుడ్డు తినడం వల్ల ఏకంగా గుండె ఆరోగ్యం బాగుపడుతుందని తేల్చింది.
బ్రిటిష్ పోషకాహార మార్గదర్శకాల ప్రకారం వారానికి మూడునాలుగు గుడ్లు తినొచ్చు. ఫ్రాన్స్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నియినా తినొచ్చు. గుడ్డు తినడం మంచిదా కాదా అన్న మీమాంస జోలికి వెళ్లకుండా మితంగా తింటే ప్రమాదం ఏమీ ఉండదని డైటీషియన్స్ అంటారు. ఆమాటకొస్తే ఏదైనా మితంగానే తినాలి.