Assembly Polls 2023: సాధారణంగా ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన వెంటనే అందరి దృష్టీ ఎగ్జిట్ పోల్స్ వైపు ఉంటుంది. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కాలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ (ఎన్నికల సంఘం) నిషేదం విధించింది. చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో రెండు విడతలుగా అంటే ఈ నెల 7వ తేదీ, 17వ తేదీలలో. మధ్యప్రదేశ్ లో ఈ నెల 17వ తేదీన పోలింగ్ ముగిసింది.
ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేదం విధించిన కారణంగా ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ను సంబంధిత సంస్థలు ప్రసారం చేయలేదు. రాజస్థాన్ లో ఈ నెల 25వ తేదీన, తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించడం లేదా ప్రచారం చేయడంపై నిషేదం ఉంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మీడియా సంస్థలు, సర్వే ఏజన్సీలు వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎన్నికల ఫలితాలను అంచనా వేసి, వాటిని ఎగ్జిట్ పోల్స్ గా ప్రకటిస్తాయి. ఈ అంచనా ఫలితాలు మిగతా ఎన్నికల రాష్ట్రాల్లో లేదా మరో దశలో పోలింగ్ జరిగే అదే రాష్ట్రంలోని ఓటర్ల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున మొత్తం ఈ అయిదు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసే వరకూ ఈసీ ఎగ్జిట్ పోల్స్ పై బ్యాన్ విధించింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 30న ముగియనుండటంతో ఆ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను సదరు సంస్థలు, ఎజన్సీలు వెల్లడిస్తాయి.

ఒక వేళ ఎవరైనా ఎన్నికల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.