వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అటు అత్త .. ఇటు మేనల్లుడు ఒకే రోజు రెచ్చిపోయిన సంఘటన వైసీపీలో కలకలం రేపుతోంది.ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి కాజా టోల్గేట్ వద్ద హల్చల్ చేయడం తెలిసిందే.
బహిరంగంగా టోల్ గేట్ వద్ద జరిగిన ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. దేవళ్ల రేవతి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో దృశ్యాలు కూడా బయటకు వచ్చేశాయి.ఇది జరిగి కొన్ని గంటలు కాకముందే..ఆమె మేనల్లుడు వైద్య సిబ్బందిపై దాడి చేసినట్లు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాచేపల్లిలోని క్రాంతి నర్సింగ్ హోమ్ లో వైద్యం చేయించుకున్న అనంతరం బిల్లు కట్టకుండా..రేవతి మేనల్లుడు దేవళ్ల వంశీ అలియాస్ వడియరాజు దాడి చేశాడని నర్సింగ్ హోం సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సదరు ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కొద్దిగా వెనక్కు వెళితే .. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవళ్ల రేవతి తన హోదాను కూడా మర్చిపోయి టోల్‌ప్లాజా వద్ద వీరంగం సృష్టించిన ఘటన సంచలనం సృష్టించింది.
గురువారం ఉదయం గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి ఆమె కారు వెళుతుండగా..టోల్ ఫీజు కట్టాలని అక్కడున్న సిబ్బంది ఆమెకు చెప్పారు.దీంతో టోల్ ప్లాజా సిబ్బందితో ఆమె గొడవకు దిగారు.ఆవేశంగా కారు దిగిన ఆమె..స్టాప్ పేరిట ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించడం వివాదానికి దారి తీసింది. దుర్భాషలాడుతూ వారిపై చేయి చేసుకుంది.ఈ వీడియోలు మీడియాలో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో సీఎంవో ఆఫీసు వివరణ కోరింది.ముఖ్యమంత్రి కూడా ఆమెపై సీరియస్‌గా ఉన్నారని సమాచారం.అయితే రేవతి టోల్ ప్లాజా సిబ్బంది తనను దుర్భాషలాడటంతోనే తాను రియాక్ట్ అయ్యానంటూ ఒక వివరణ ఇచ్చింది.
మీడియాలో చూపిస్తున్న వీడియో ఎడిట్ చేయబడిందని ,పూర్తి వీడియో చూపిస్తే అసలేం జరిగిందో అందరికీ అర్థమవుతుందని రేవతి చెప్పుకొచ్చింది.ఈ వివాదం కొనసాగుతుండగానే గురువారం సాయంత్రమే ఆమె మేనల్లుడు వంశీ దాచేపల్లిలోని ఒక ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికిత్సకు అయిన వ్యయాన్ని చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా తాను ఎవరో తెలుసా అంటూ అతను గొడవకు దిగి వారిపై దౌర్జన్యం చేశాడంటున్నారు .ఈ వీడియోలు కూడా మీడియాకు అందాయి.ఇక ఆ ఆసుపత్రి యాజమాన్యం వంశీ పై ఫిర్యాదు చేసిందని,విచారణ జరుపుతున్నామని గురజాల సీఐ ఉమేశ్ కూడా ధ్రువీకరించారు.ఈ అత్త మేనల్లుళ్ల విషయంలో సీఎం జగన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి!