సినీ రంగంలో రాణించాలని చాలా మంది కలలు కంటుంటారు. హీరో హీరోయిన్లు గుర్తింపు పొందాలని కొందరు దేశాలు, రాష్ట్రాలు దాటి సినీ పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. అలాంటి వారిలో బనితా సంధు ఒకరు. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఆమె నటించిన పలు సినిమాలు హిట్ అందుకున్నాయి. సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు. ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా ఈ భామ పంజాబీ సింగర్ ప్రేమలో మునిగినట్లు, అతనితో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎవరితో డేటింగ్ చేస్తుంది? అసలు బనితా సంధు ఎవరు? ఆమె సినీ ప్రస్థానం తదితర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బనితా సంధు జననం, విద్యాభ్యాసం..
కెర్లియన్, వేల్స్‌లో మొదటి తరం బ్రిటీష్ ఇండియన్ తల్లిదండ్రులకు బనితా సంధు పుట్టారు. 1997 జూన్ 22న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 26 సంవత్సరాలు. బనితా సంధుకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువ. తన 11వ యేటే ఆమె నటించడం ప్రారంభించారు. స్కూళ్లలో డ్యాన్స్‌లు, స్టేజ్ పర్ఫార్మెన్స్‌లలో చురుకుగా పాల్గొనేవారు. 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లారు. అక్కడ కింగ్స్ కాలేజ్ లండన్‌లో ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి మోడలింగ్, యాక్టింగ్ వైపు వెళ్లింది.
మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా..
బనితా సంధు మోడలింగ్ ద్వారా కెరీర్‌ను మొదలు పెట్టారు. రిగ్లీ కంపెనీకి చెందిన డబుల్ మింట్ కోసం ఒక యాడ్‌లో ఆమె మొదటి సారిగా నటించారు. ఈ యాడ్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ సీజన్‌లో ప్రసారం చేయబడిని ‘వొడాఫోన్ ఇండియా’ యాడ్‌లో నటించారు. ఈ యాడ్ ద్వారా ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

‘అక్టోబర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగులు..
యాడ్స్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న బనితా సంధుకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘అక్టోబర్’ సినిమాలో బనితా సంధుకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. 2018లో విడుదలైన ఈ సినిమాలో సంధు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత తమిళం, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. హిందీలో ‘సర్దార్ ఉద్దం, డిటెక్టివ్ షెర్డిల్’ సినిమాల్లో కనిపించారు. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ సినిమాలో నటించింది. ఇంగ్లీష్‌లో ‘ఎటర్నల్ బ్యూటీ, మదర్ థెరిసా అండ్ మీ’ సినిమాల్లో నటించారు. అలాగే ‘పెయింటింగ్ హ్యుమానిటీ, బ్రిడ్జర్టన్, పండోర వంటి వెబ్ సిరీస్‌లలో ఆమె నటించారు. అలాగే సాంగ్స్ ఆల్బమ్స్‌లో కూడా నటించారు.

పంజాబీ సింగర్‌తో డేటింగ్?
బనితా సంధు 2018లో ‘జింద్ మాహి’ అనే పాటలో నటించారు. ఈ సాంగ్ భారీ వ్యూవ్స్ దక్కించుకుంది. రీసెంట్‌గా పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాస్‌తో కలిసి ‘విత్ యూ’ సాంగ్‌లో నటించారు. ఆగస్టులో విడుదలైన ఈ సాంగ్ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సాంగ్‌లో వీరిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. తాజాగా సింగర్ ఏపీ ధిల్లాస్‌కు సంబంధించి ‘ఏపీ ధిల్లాస్: ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్’ అనే డాక్యుమెంట్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. జే. అహ్మద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్.. పంజాబీ కుర్రాడి నుంచి గ్లోబల్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారిన ధిల్లాస్ జీవిత ప్రయాణంపై సాగుతుంది. అయితే తమ మొదటి పరిచయం నుంచే వీరిద్దరిపై బాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. సంధు, ధిల్లాస్ ప్రేమలో ఉన్నారని, సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ సిరీస్ ప్రమోషన్‌లో ఇద్దరూ కలిసి ఒకే కారులో వచ్చారు. దాంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే వీరిద్దరూ సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.