మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ దూకుడు పెంచింది. ఈ నెలఖరులోగా విచారణను పూర్తి చేయాలని సీబీఐ అధికారులకు సుప్రీం కోర్టు ఇటీవల డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో కేసులో ప్రధాన నిందితుల అరెస్టునకు సీబీఐ ఉపక్రమించింది. ఈ క్రమంలో భాగంగా కడప జిల్లా పులివెందులకు చేరిన సీబీఐ బృందం ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ అడిషనల్ ఎస్పీ ముఖేష్ శర్మ ఆధ్వర్యంలో భాస్కరరెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ భాస్కరరెడ్డితో పాటు ఆయన పీఎ రాఘవరెడ్డి ని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు వారిని హైదరాబాద్ కు కు తరలిస్తున్నట్లు సమాచారం. సీబీఐ అధికారులు అరెస్టు మెమోను భాస్కరరెడ్డి భార్య లక్ష్మికి అందజేశారు. 120 బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన సెల్ ఫోన్ ను సీజ్ చేశారు.

మరో పక్క సీబీఐ అధికారులు హైదరాబాద్ లోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయమే అధికారులు అవినాష్ నివాసానికి చేరుకున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించింది. ఇక రెండు రోజుల క్రితమే అవినాష్ అనుచరుడు ఉదయ్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ భాస్కరరెడ్డి అరెస్టు, అనివాష్ విచారణ వ్యవహారం తీవ్ర సంచలనం అయ్యింది. మరో పక్క ఉదయ్ విచారణలో భాగంగా అతని ఫోన్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు సీబీఐ రిపోర్ట్ లో వెల్లడించింది.
వివేకా హత్య కేసులో ఉదయ్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్ విధించారు. వైఎస్ వివేకా హత్యకేసులో ఉదయ్ రెడ్డి విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్ వేసింది. ఉదయ్‌కుమార్ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్ మంజూరుకు మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. వివేకా హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ రెడ్డి కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.