Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్టు చేసి నెలరోజులు కావస్తొంది. గత నెల 9వ తేదీన నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి మరుసటి రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. గత నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

గత నెల రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో పార్టీ క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది. నాలుగు దశాబ్దాల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చవి చూడలేదు. తొలి సారిగా ఆయన జైలు గోడల మధ్య నెల రోజుల పాటు ఉండిపోయారు. చంద్రబాబు ఇన్ని రోజుల పాటు జైలులో ఉంటారని ఎవ్వరూ ఊహించలేదు. అరెస్టు అయిన వెంటనే బెయిల్ పై బయటకు వస్తారని టీడీపీ శ్రేణులు భావించారు. అయితే వారి అంచనాలు తల్లకిందులైయ్యాయి. అరెస్టు అయిన వెంటనే బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించి ఉంటే ఈ పాటికి బెయిల్ వచ్చేదనీ, కానీ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం ప్రయత్నాలు ప్రారంభించడం వల్లనే ఇంత ఆలస్యం జరిగిందనే మాటలు వినబడుతున్నాయి.

ఇక రేపు అక్టోబర్ 9 (సోమవారం) చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు అత్యంత కీలకంగా కానుంది. దిగువ కోర్టు నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలు, తీర్పులు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ తన పై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది. ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారమే తీర్పు వెల్లడించనున్నది. అలానే చంద్రబాబును సీఐడీ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్ పై కూడా సోమవారం ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏబీసీ కోర్టులో వాదనలు ముగియగా, ఉత్తర్వులను సోమవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.

మరో పక్క చంద్రబాబుకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్ల పై ఏపీ హైకోర్టు సోమవారం తీర్పులు వెల్లడించనుంది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి తీర్పులను రిజర్వు చేసారు. ఈ మూడు పిటిషన్ల పైనా సోమవారమే న్యాయమూర్తి తీర్పులను వెల్లడించనున్నారు. దీంతో అందరి చూపు న్యాయస్థానాలపై ఉంది. ఇటు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, అటు సుప్రీం కోర్టుల్లో చంద్రబాబుకు ఎలాంటి తీర్పులు వెలువడతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.
BRS vs BJP: కేసీఆర్ పై మోడీ వ్యాఖ్యల్లో మర్మం ఏమిటంటే..? ఆ కీలక పదవిపై కేసిఆర్ కన్ను..!