శీతాకాలం రానే వచ్చింది. ఈ సమయంలో చాలా మంది వెకేషన్ వెళ్లేందుకు ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న రావడం సమాజం. అలాంటి వారి కోసం ఈ రోజు మనం అత్యుత్తమమైన పర్యాటక ప్రదేశాల గురించి చర్చించబోతున్నాము. దక్షిణ భారతదేశంలో అనేక అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఈ శీతాకాలంలో రిఫ్రెష్ అవ్వడానికి ఈ ప్రాంతాలు ఎంతో అణువైనవి. బీచ్‌లు, అడవులు, బోటు ప్రయాణం, ట్రెక్కింగ్ వంటివి కలిగిన ప్రదేశాలు, వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొడైకెనాల్ (తమిళనాడు)
దక్షిణ భారతదేశంలో కొడైకెనాల్ హిల్ స్టేషల్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సరస్సులు, జలపాతాలు, లోయలు, కొండలు… సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. కొడైకెనాల్ సరస్సు, డాల్ఫిన్ నోస్, వట్టకనల్ జలపాతం, కోకర్స్ వాక్, కురింజి అందవల్ దేవాలయం వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఉదయం పూట ఇక్కడి వాతావరణం పొగమంచుతో కప్పబడి ఉంటుంది.

ఊటీ (తమిళనాడు)
ఊటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శీతాకాలంలో ఊటీ అందాలు చూడటానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఊటీ అనేది పశ్చిమ కనుమ పర్వతాల ఒడిలో ఉన్న చిన్న పట్టణం. దీన్ని ఉదగమండలం అని కూడా పిలుస్తుంటారు. బ్రిటీష్ కాలంలో మద్రాస్ రెసిడెన్సీ వేసవి రాజధానిగా పిలవబడింది. ఇక్కడ సరస్సులు, ఆనకట్టలు, ఉద్యానవనాలు, టీ ఫ్యాక్టరీలు, గిరిజనుల మ్యూజియం, నీలగిరి మౌంటైన్ రైల్వే, వారసత్వ కట్టడాలు ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులకు ఇదోక అద్భుతమైన ప్రదేశం.

కొచ్చి (కేరళ)
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాట ప్రదేశం ‘కొచ్చి’. ప్రతీ సీజన్‌లో పర్యాటకులను ఆకర్షించే ఏకైక ప్రాంతం. ఇక్కడి వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. ఫోర్ట్ కొచ్చి, మట్టంచెరి, కోదానంద్ ఎలిఫెంట్ ట్రైనింగ్ సెంటర్, మెరైన్ డ్రైవ్, హిల్ ప్యాలెస్ మ్యూజియం, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, జ్యూ సినాగోగ్ అండ్ జ్యూ టౌన్ ఇక్కడి ప్రసిద్ధ ప్రాంతాలు.

అలెప్పీ (కేరళ)
ఇటలీలోని వెనిస్ నగరం మాదిరిగానే అలెప్పీ సహజ సౌందర్యాన్ని కనుగొన్న లార్డ్ కర్జన్ ఈ నగరాన్ని ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ గా పేర్కొన్నాడు. అలెప్పీని కేరళ హౌజ్‌బోట్ రాజధానిగా పిలుస్తారు. బ్యాక్ వాటర్ టూరిజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక్కడి జలమార్గాలు, బీచ్‌లు, హౌజ్‌బోట్‌లు సందర్శకులకు కట్టిపడేస్తాయి. అలప్పుజా బీచ్, మరారి బీచ్, పున్నప్రా బీచ్, అలెప్పీ లైట్ హౌజ్, వెంబనాడ్ సరస్సు, కారుమడి, ముల్లక్కల్ రాజేశ్వరి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. శీతాకాలంలో విడిదికి మంచి ప్రాంతంమని చెప్పవచ్చు.

కూర్గ్ (కర్ణాటక)
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాట ప్రదేశాల్లో కూర్గ్ ఒకటి. దీన్ని ‘ది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. పశ్చిమ కనుమల పర్వాతాలలో చుట్టుముట్టబడిన ఈ కొండ పట్టణంలో హిల్ స్టేషన్, సుగంధ టీ, కాఫీ, మసాలా తోటలు కనిపిస్తాయి. ఆహ్లాదకర వాతావరణం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది. తడియాండమోల్ శిఖరం, రాజాస్ సీట్, ఇరుప్పు జలపాతం, అబ్బే జలపాతం, టిబెటన్ మొనాస్టరీ అండ్ గోల్డెన్ టెంపుల్, దుబరే ఏనుగుల శిబిరం. వంటి పర్యాటక ప్రదేశాలు కలవు.

పాండిచ్చేరి (తమిళనాడు)
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి 165 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాండిచ్చేరి భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం. భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో పాండిచ్చేరి ఒకటి. ఇక్కడ తెల్లటి భవనాలు, చెట్లతో నిండిన వీధులు కనిపిస్తుంటాయి. శ్రీ అరబిందో ఆశ్రయం, పారడైజ్ బీచ్, రాక్ బీచ్, సెరీనిటీ బీచ్, సీ సైడ్ ప్రొమెనేడ్, ది బసిలికా ఆఫ్ ది సెక్రేడ్ హార్ట్ ఆఫ్ జీసన్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి.

అరకులోయ (ఆంధ్రప్రదేశ్)
తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమిది. అరకు లోయ అందాలు, దట్టమైన అడవులు, కాఫీ తోటలు, జలపాతాలు, విస్తరించిన పంట పొలాలు పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంది. విశాఖపట్నం నుంచి 111 కిలో మీటర్ల దూరంలో అరకులోయ ఉంది. శీతాకాలపు మధ్యాహ్న సమయంలో పసుపు సూర్యకాంతి కొండల మధ్య నుంచి విశాలమైన వరి పొలాల మీద పడినప్పుడు ఆ వీవ్ అద్భుతంగా ఉంటుంది.

లంబసింగి (ఆంధ్రప్రదేశ్)
లంబసింగి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం. ఇది విశాఖపట్నం నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. దట్టమైన అడువులల్లో వన్యప్రాణులు నివసిస్తూ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుంది. కొండకర్ల పక్షుల అభయారణ్యం, తుంజంగి రిజర్వాయర్, సుసాన్ గార్డెన్, బొజ్జన్న కొండ, ఘాట్ రోడ్, కొత్తపల్లి జలపాతాలు ఇక్కడ ప్రసిద్ధి.