చిత్రం: బందోబస్త్
సెన్సార్: యు/ఎ
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
తారాగణం: సూర్య, మోహన్‌లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు
దర్శకత్వం: కె.వి.ఆనంద్
నిర్మాత: సుభాస్కరన్
సంగీతం: హేరీష్ జైరాజ్
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.ప్రభు
రైటర్స్: పి.కె.పి, శ్రీరామకృష్ణ
పాటలు: వనమాలి, చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్: డి.ఆర్.కె.కిరణ్
ఎడిటర్: ఆంటోని
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్స్
`వీడొక్కడే`, `బ్రదర్స్` చిత్రాల తర్వాత హీరో సూర్య, కె.వి.ఆనంద్ కాంబినేషన్లో రూపొందిన హాట్రిక్ చిత్రం `బందోబస్త్`. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రంలో సూర్య ఎన్.ఎస్.జి కమెండోగా నటించారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాని పాత్రలో నటించారు. ఓ ప్రధానిని కమొండో కాపాడటానికి ఏం చేశాడు? అసలు ఆయనకు వచ్చిన ప్రమాదమేంటి? అసలు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య `బందోబస్త్` చిత్రంతో సక్సెస్ సాధించాడా? లేదా? అసలు ఈ సినిమా ద్వారా దర్శకుడు కె.వి.ఆనంద్ ఏం చెప్పాలనుకున్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
కథ:
లండన్ పర్యటనలోని దేశ ప్రధాని చంద్రకాంత్ వర్మ(మోహన్‌లాల్)ను కొందరు దుండగులు చంపడానికి ప్రయత్నిస్తారు. వారి నుండి ఆయన్ని రవికాంత్(సూర్య) అనే మిలటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కాపాడుతాడు. రవికాంత్ స్పీడు, యాక్టివ్నెస్ నచ్చడంతో రవికాంత్‌ను తన ఎన్.ఎస్.జి కమొండోగా నియమించుకుంటాడు. అయితే టెర్రరిస్టులు ఓ ప్లాన్ ప్రకారం కాశ్మీర్ పర్యటనలోని ప్రధానిని బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తారు. దీంతో చంద్రకాంత్ స్థానంలో ఆయన కొడుకు అభిషేక్ ప్రధాని అవుతాడు. అదే సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మహదేవ్(బోమన్ ఇరాని) చేసే అక్రమ మైనింగ్ గురించి అభిషేక్‌కి తెలుస్తుంది. అలాగే ఉభయగోదావరి జిల్లాలోని గ్యాస్ కోసం మహదేవ్ ఓ భయంకరమైన ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? దాన్ని రవికాంత్ ఎలా అడ్డుకుంటాడు? ప్రధాని అభిషేక్‌ను ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
హీరో సూర్య ఓ నెటివిటీతో ఈ సినిమా కోసం యూనివర్సల్ పాయింట్‌ను ఎంచుకున్నాడు. తొలిసారి ఎన్.ఎస్.జి కమొండో పాత్రలో కనిపించాడు సూర్య. తన పాత్ర కోసం లుక్, ఫిజిక్ విషయంలో పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. యాక్షన్ సీన్స్‌లోనూ సూర్య చక్కగా చేశాడు. ఇక ప్రధాని పాత్రలో మోహన్‌లాల్ నటన బావుంది. ఇలాంటి పాత్రలో చేయడం మోహన్‌లాల్‌కు పెద్ద కష్టమేమీ కాదు. ఆర్య, సయేషా, బోమన్ ఇరాని, సముద్రఖని, పూర్ణ పాత్రలు పరిమితంగా ఉన్నాయి. ఆ పరిధి మేర వారు పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కె.వి.ఆనంద్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉంది. అయితే దాన్ని తెరకెక్కించే విధానమే బాగా లేదు. రెండు, మూడు సన్నివేశాలు మినహా, మిగిలినవన్నీనార్మల్గా ఉన్నాయి. ప్రేక్షకుడికి ఆకట్టుకునే సన్నివేశాలు లేవు. ఇక లవ్ ట్రాక్, పాటలు ప్రేక్షకుడికి పెద్ద భారంగా మారాయి. డైలాగ్స్ ఆకట్టుకునేలా లేవు. ప్రభు కెమెరా పనితనం బావుంది. హేరీశ్ జైరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే.
చివరగా.. బందోబస్త్.. బలహీనంగా ఉంది
రేటింగ్: 2.25/5