Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చేలా హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిశాయి. సీబీఐ విచారణ జరపాలని నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ..కేసుకు సంబంధించిన వీడియోలు, వివరాలను బయటపెట్టారన్న ఒకే ఒక్క కారణంతో కేసును సీబీఐ కి అప్పగించడం తగదని దవే వాదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై నమ్మకం లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే దర్మాసనం గత నెల 30వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సీజే ధర్మాసనం సమర్ధిస్తుందా.. లేక సీట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతుండగా, సీజే ధర్మాసనం ఇవేళ కీలక తీర్పును వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సీజే ధర్మాసనం సమర్దిస్తూ సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున ఏజీ కోరారు. అప్పటి వరకూ హైకోర్టు ఉత్తర్వులను సస్పెన్షన్ లో ఉంచాలని ఏజీ అభ్యర్ధించారు. ఏజీ అభ్యర్ధనను హైకోర్టు తోసి పుచ్చింది.
అసలు ఏమి జరిగింది అంటే… గత ఏడాది అక్టోబర్ 26న హైదరాబాద్ శివారు మోయినాబాద్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలను నిర్వహిస్తున్న అభియోగంపై రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగానే దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో 0 మాటల యుద్దానికి దారి తీసింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్.. న్యాయస్థానం అనుమతితో నిందితులను పలు మార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది.
ఈ క్రమంలోనే లభించిన ఆధారాలతో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ తో పాటు కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామిని విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారు హైకోర్టును ఆశ్రయించి సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే పొందారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు బెయిల్ కోరుతూ హైకోర్టు ను ఆశ్రయించగా పలు దఫాలుగా విచారణ జరిపిన న్యాయస్థానం అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారు జైలు నుండి విడుదల అయ్యారు. తొలుత నిందితులతో పాటు బీజేపీ.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు కేసు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉండగానే ప్రభుత్వం .. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు