Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అప్పట్లో అరెస్టు అయి జైల్ లో ఉన్నందున తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ అధికారికంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకలేదు. ఏపీలో టీడీపీకి పొత్తులో ఉన్న జనసేన పార్టీ.. తెలంగాణలో బీజేపీతో కలిసి 8 స్థానాల్లో పోటీ చేసినా అధికారికంగా జనసేన అభ్యర్ధులకు టీడీపీ మద్దతు పలకలేదు. అయితే ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధుల ఎన్నికల ప్రచార ర్యాలీలో టీడీపీ జండాలతో ఆ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు (టీడీపీ) ఓటమికి కేసిఆర్ పరోక్షంగా జగన్ కు సహకరించారన్న భావన ఉండటంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్వ టీడీపీ నాయకుడు కావడంతో తెలంగాణలోని టీడీపీ సానుభూతిపరులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేయాలన్న నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపునకు పని చేశారని అంటున్నారు. ఆదివారం తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుండటంతో గాంధీ భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా పార్టీ జెండాలు పట్టుకుని డ్యాన్స్ చేస్తూ కాంగ్రెస్ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల తీరు ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి .. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల వేడుకల్లో టీడీపీ జెండాలు ఊపుతున్న ఫోటోను షేర్ చేశారు.
తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించిందని విజయసాయి విమర్శించారు. ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! అని విజయసాయి ప్రశ్నించారు.
Telangana Janasena: తెలంగాణలో జనసేనకు ఘోర పరాభవం .. ‘కమ్మ’గా దెబ్బేశారు(గా)..!
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించింది. ఆంధ్రాలో బిజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ! pic.twitter.com/hHOik3u0wP
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 3, 2023