ప్రపంచ వ్యాప్తంగా ఏటా అనేక మంది మరణాలకు కారణమవుతున్న జబ్బుల్లో గుండె జబ్బు కూడా ఒకటి. గుండె సమస్య ఏదైనా సరే.. పర్యవసానం స్ట్రోక్ రూపంలో వస్తుంది. దాన్ని తట్టుకుని పోరాడితే ఓకే. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. అయితే నిజానికి హార్ట్ స్ట్రోక్ లను రాకుండా చూసుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. నిత్యం మనం చేసే పలు పనులతోపాటు పలు అలవాట్లు కూడా హార్ట్ స్ట్రోక్‌కు కారణమవుతుంటాయి. అవేమిటో, వాటి నుంచి తప్పించుకుని హార్ట్ స్ట్రోక్ లు రాకుండా ఎలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
* నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుతోంది. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. దీంతో గమ్యస్థానాలకు ఆలస్యంగా వెళ్తున్నారు. అయితే ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారు సమయానికి వెళ్తామా, లేదా అని ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. ఇది హార్ట్ స్ట్రోక్‌లకు దారి తీస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక ఈ తరహా స్థితిని నిత్యం ఎదుర్కొనే వారు వీలైనంత వరకు ఆందోళన చెందకుండా ఉండాలి. సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలనుకుంటే మధ్యలో ఎదురయ్యే ట్రాఫిక్‌ను కూడా లెక్క వేసుకుని అందుకు ఎంత సమయం అవుతుందో లెక్కించాలి. ఈ క్రమంలో ఆ సమయం ప్రకారం కొంత ముందుగానే బయల్దేరితే అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో మార్గ మధ్యలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడినా ఆందోళనకు గురి కావల్సిన పని ఉండదు. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
* రాత్రి వేళ్లలో విధులు నిర్వహించే వారికి హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక అలాంటి వారు రాత్రి షిఫ్ట్‌లను పూర్తిగా మానేయడం మంచిది. లేదా వీలైనంత తక్కువగా రాత్రి వేళల్లో పనిచేసేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
* దంత సమస్యలు ఉన్నవారు హార్ట్ ఎటాక్ల బారిన పడే అవకాశం ఉంటుంది. దంతాలు, చిగుళ్లలో ఉండే సూక్ష్మ క్రిములు అక్కడి రక్త ప్రవాహంలో కలుస్తాయి. అవి రక్త నాళాల్లో ఇన్ఫెక్షన్, వాపులను కలిగిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు వస్తాయి. కనుక దంతాలు, చిగుళ్ల సమస్యలు లేకుండా చూసుకుంటే హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
* పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవారు కూడా హార్ట్ ఎటాక్ల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చేస్తే పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
* నిద్ర సరిగ్గా పోకపోతే బీపీ, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇవి కూడా గుండె సమస్యలకు కారణమవుతాయి. కనుక నిత్యం కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్ర అయినా పోవాలి. దీని వల్ల హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి.