Innar Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సీఐడీ .. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఏ 1, ఏ 2 నిందితులుగా ఉండగా, ఇటీవలే నారా లోకేష్ ను నిందితుడుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ.

ఈ కేసులో విచారణకు లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లోని పలు నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది హెరిటేజ్ సంస్థ రికార్డులపై ఒత్తిడి చేయబోమని తెలిపారు. దీంతో ఈ నెల 12వ తేదీ సీఐడీ విచారణకు హజరు కావాలని హైకోర్టు లోకేష్ కు ఆదేశించింది. లోకేష్ తో కలిపి నారాయణను విచారించాలని సీఐడీ భావిస్తొంది.
అయితే నారాయణ తన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, తాజాగా మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తోపాటు ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావులను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిందితులుగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు సీఐడీ కేసు నమోదు చేసింది.