AP CID Innar Ring Road Scam: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో విచారణకు హజరుకావాలంటూ ఇప్పటికే నారా లోకేష్ కు సీఆర్పీసీ 41 ఏ నోటీసులు జారీ చేసిన ఏపీ సీఐడీ తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ నెల 4వ తేదీన విచారణకు హజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా నారాయణ ఉండగా, నారాయణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. ఏపీ సీఐడీ దూకుడు పెంచిన నేపత్యంలో నారాయణ అరెస్టునకు భయపడి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ లోపుగానే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నారా లోకేష్ ది కీలక పాత్ర ఉందన్న అభియోగంతో సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన విచారణకు హజరుకావాలంటూ ఢిల్లీకి వెళ్లి మరీ సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు అందజేశారు.

ఇప్పుడు అదే తేదీన నారాయణను సైతం విచారణకు పిలవడంతో నిందితులు ఇద్దరినీ కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పేరిట భారీ అవినీతి జరిగినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. హెరిటేజ్ కు సంబందించి భూముల కొనుగోలు, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్, కొనుగోళ్లకు సంబంధించి మినిట్స్ ఇతర వివరాలను కూడా లోకేష్ విచారణ సమయంలో వెల్లడించాలని సీఐడీ కోరింది.
అయితే ప్రస్తుతం తాను హెరిటేజ్ లో డైరెక్టర్ గా లేనని లోకేష్ చెబుతున్నారు. విచారణలో నారా లోకేష్ సంబంధించిన విషయాలు వెల్లడించకపోతే ఆ సంస్థలో డైరెక్టర్ లుగా ఉన్న నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణిలను కూడా నోటీసులు ఇచ్చి విచారణకు సీఐడీ పిలిచే అవకాశం ఉందని కూడా వార్తలు వినబడుతున్నాయి. మరో పక్క సీఐడీ నోటీసులపై నారాయణ స్పందించారు. తాను విచారణకు హజరు అవుతానని, వివరాలను అధికారులకు వెల్లడిస్తానని చెప్పారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో అంతకు మించి దీనిపై స్పందించనని అన్నారు.
Vijaya Sai Reddy: తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్