Chandrababu: స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు తరపున న్యాయవాదులు రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. ఆరోగ్య రీత్యా చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్టు గా మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరో పిటిషన్ ను వేశారు. మరో పక్క చంద్రబాబును కస్టడీలోకి విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగనున్నది.

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో నిన్న ఉదయం నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల నుండి రోడ్డు మార్గం గుండా విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించిన సీఐడీ అధికారులు శనివారం రాత్రి సుదీర్ఘంగా విచారణ చేశారు. ఈ సందర్భంలో చంద్రబాాబు విచారణకు సహకరించలేదని సమాచారం.
దాదాపు 20 ప్రశ్నలను సంధించగా వాటికి తెలియదు, గుర్తు లేదు అన్నట్లుగా సమాధానం చెప్పినట్లు తెలుస్తొంది. కాగా ఆదివారం వేకువ జామున చంద్రబాబుకు వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హజరుపర్చగా, రిమాండ్ అంశంపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కోర్టులో ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి.

చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూద్రా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు మధ్యాహ్నం వరకూ ముగించిన న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాట్లను పోలీసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపున బెయిల్ పిటిషన్ తో పాటు గృహ నిర్బంధం పిటిషన్ ను దాఖలు చేశారు.
Big Breaking: చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు