Ganta Srinivasa Rao: ఒకే ఒక్క కండీషన్ తో జనసేనలోకి గంటా..!!

Share

Ganta Srinivasa Rao: ఏపిలో ఈయన ఒక ప్రత్యేకమైన నాయకుడు…ఈయన ప్రత్యేకం ఏమిటంటే..ఒక నియోజకవర్గం అంటూ ఉండదు..ఒక స్థానం అంటూ ఉండదు..ఒక పార్టీ అంటూ ఉండదు..కానీ రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో మనుగడ సాగిస్తూనే ఉన్నారు. ఓటమి అనేది లేకుండా ప్రతి సారీ విజయం సాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ నాయకుడు ఎవరో అర్ధం అయ్యే ఉంటుంది కదా. ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన అయిదు ఎన్నికల్లో అయిదు నియోజకవర్గాల్లో పోటీ చేసి మూడు పార్టీల్లో మనుగడ సాగించి ఇప్పుడు నాల్గవ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ఆ పార్టీకి ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండీషన్ కు ఆ పార్టీ ఒప్పుకుంటే గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరిపోతారు.

Ganta Srinivasa Rao likely to join janasena
Ganta Srinivasa Rao likely to join janasena

Ganta Srinivasa Rao: గంటా రాజకీయ నేపథ్యం ఇది..

1999లో గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి నుండి లోక్ సభ స్థానం నుండి ఏంపిగా గెలిచారు. 2004 చోడవరం నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పార్టీ రెండు నియోజకవర్గాలు అయిపోయాయి. 2009 ఎన్నికల నాటికి ప్రజా రాజ్యం పార్టీలో జాయన్ అయ్యారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రజా రాజ్యం తరపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచారు. 2014లో మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మంత్రిగా పని చేశారు. మళ్లీ 2014 వచ్చే సరికి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. 2019 లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. మూడు పార్టీలు, మూడు గుర్తులు, అయిదు నియోజకవర్గాలు, ఒక సారి ఎంపి. నాలుగు సార్లు ఎమ్మెల్యే. ఇది గంటా రాజకీయ జీవిత చక్రం. విచిత్రం..విడ్డూరం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత టీడీపీలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎందుకంటే ఆయన సామాజికవర్గంలో ఆయనకు పట్టు ఉంది. చక్రం తిప్పగలరు. వ్యూహాలను రచించగలరు. తెరవెనుక రాజకీయాలు బాగా నడపగలరని పేరు ఉంది. ఆర్ధికంగా పరిపుష్టి ఉన్న నాయకుడు కావడంతో ఆయన హవా అలా సాగుతూ వచ్చింది. ఇప్పుడు విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉండటంతో ఆయన సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు బాగా వెనకేసుకున్నారనీ, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు హావా సాగించిన ఆయన టీడీపీ ప్రతిపక్షంలో ఉండటంతో సైలెంట్ అయిపోయారనీ, విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ గట్టిగా టీడీపీ కోసం పని చేయలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. గత అవినీతి చరిత్రను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తవ్వుతుందని భయపడి ఆయన సైలెంట్ గా ఉన్నారని ఆయన ప్రత్యర్ధులు అంటుంటారు. ఆయన సైలెంట్ గా ఉండటంతో టీడీపీ  కూడా ఆయనను పక్కన పెట్టేసింది. ఆయన గురించి పట్టించుకోవడం మానేసింది.

ఆ కండిషన్ తో జనసేనలోకి..?

2019లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుండి వైసీపీలో వెళ్లాలని గంటా తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ సీఎం జగన్మోహనరెడ్డి ఒప్పుకోలేదని సమాచారం. గంటా వ్యవహారం జగన్ కూడా తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి అధికారాన్ని అనుభవించి అధికారం కోల్పోవడంతో వేరే పార్టీకి వెళతారని తెలుసు. అందుకనే గంటాను వైసీపీలోకి రానివ్వలేదు. ఇటు టీడీపీలో ఉండలేక, అటు వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక చూసి చూసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ద్వారా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ వ్యూహం ఫలించలేదు. ఆయన గురించి వాళ్లు అంతగా పట్టించుకోలేదు. అయితే ఆయనకు బీజేపీ నుండి ఆహ్వానం ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. ఆ పార్టీలో చేరినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి ఇప్పుడు జనసేనలో చేరాలని తెరవెనుక ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. జనసేనకు వెళితే సామాజికవర్గం కలిసి వస్తుంది. సీనియర్ నాయకుడుగా తన హవా నడుస్తుంది అన్నది ఆయన భావన., అయితే జనసేనలో చేరడానికి ఓ కండిషన్ పెట్టాడని అంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేనకు టీడీపీ పొత్తు ఉంటేనే తాను జనసేనలో చేరడానికి సిద్దమని అంతర్గతంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ పొత్తుతో జనసేన అభ్యర్ధిగా విశాఖ జిల్లాలో మరో నియోజకవర్గాన్ని ఎంచుకుని ఈజీగా విజయం సాధించవచ్చని ఆయన ధీమా. ఒక వేళ అధికారంలో వస్తే జనసేన కోటాలోౌ మళ్లీ మంత్రి కావచ్చు అన్నది ఆయన భావనగా చెబుతున్నారు. జిల్లాలో గట్టి నాయకుడిగా పేరు ఉండటంతో పాటు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కారణంగా జనసేన కూడా ఆయన చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి గంటా మరో పార్టీతో మరో నియోజకవర్గానికి వెళతారో లేదో వేచి చూద్దాం.


Share

Related posts

ట్రిపుల్ తలాక్ చట్టం కేసు నమోదు

somaraju sharma

శ్రీ‌లంక లేదా యూఏఈల‌లో ఐపీఎల్‌..? ఐసీసీ నిర్ణ‌యం కోసం బీసీసీఐ వెయింటింగ్‌..!

Srikanth A

ఒకటే టాపిక్: తెల్లరుతూనే వైకాపాలో చెవులు కొరికేసుకునేంత డిస్కషన్!

CMR