YS Jagan: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తీసుకున్న కీలక నిర్ణయాల్లో ముఖ్యమైనది రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలన్నది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం సీఎం జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చారు. అనుకున్నదే తడవుగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంటూ అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు.

ఈ బిల్లుకు నాడు శాసనమండలిలో ఆమోదం పొందనప్పటికీ గవర్నర్ ద్వారా ఆమోదించుకుని చట్టం చేశారు. అయితే జగన్మోహనరెడ్డి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకించడం, అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేసినా తాను చేసిన నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగింది. రాజధాని వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తుందని భావించిన ప్రభుత్వం ముందుగానే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. అదే రోజు అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు రాకుండా మెరుగైన బిల్లు తీసుకువస్తామని సీఎం జగన్ చెప్పారు. మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఆ తర్వాత హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో కొద్ది నెలలు వెయిట్ చేసిన తర్వాత సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరినా కొన్ని అంశాలకే సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. రాజధానుల అంశానికి సంబందించిన కేసును త్వరితగతిన విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం పలు మార్లు సుప్రీం కోర్టును కోరినప్పటికీ అక్కడ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతుందే తప్ప ఇప్పట్లో తెమిలేలా కనబడటం లేదు. ఎన్నికల లోపు దీనిపై విచారణ పూర్తి అయి తీర్పు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో జగన్మోహనరెడ్డి సర్కార్ ప్లాన్ బీ అమలు చేయడానికి సిద్దం అయ్యింది. ప్లాన్ బీ లో భాగంగా జగన్మోహనరెడ్డి తన మకాంను విశాఖకు షిప్ట్ చేసి అక్కడ నుండే పరిపాలన సాగించాలని నిర్ణయానికి వచ్చేశారు.

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్, భారతి దంపతులు అక్కడ నుండి విశాఖకు మకాం షిప్టింగ్ పై ముహూర్తం ఖరారు చేశారని అంటున్నారు. రాబోయే విజయ దశమి (అక్టోబర్ 23) రోజునే జగన్మోహనరెడ్డి దంపతులు విశాఖలో కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారని సమాచారం. అక్కడ నుండే జగన్ పరిపాలనా సాగిస్తారని అంటున్నారు. రుషికొండ వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో జగన్ నివాసం ఉండనున్నారు. విశాఖ ఎంపీ భవనంలో క్యాంప్ అఫీసు ఏర్పాటు చేసుకుంటారని అంటున్నారు. అందుకు అనుగుణంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారంలో మూడు రోజులు జగన్ విశాఖలో ఉంటూ పాలన సాగిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుండి బుధవారం వరకూ జగన్ విశాఖలో ఉంటారని, గురువారం నుండి శనివారం వరకూ తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుండి పాలన సాగిస్తారని అంటున్నారు. ఇలా రెండు చోట్ల రాజధానులను జగన్ ఉనికిలో ఉంచబోతున్నారు. మూడవ రాజధానిగా నిర్ణయించిన కర్నూలులో ఎన్నికలలోపు న్యాయశాఖ కార్యాలయాల్లో కొన్ని అయినా షిప్ట్ చేయడం ద్వారా తాము అనుకున్న మూడు రాజధానుల యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసినట్లు అవుతుందని భావిస్తున్నారు.

ఇక విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వేగంగా ప్రభుత్వం అడుగులు వేస్తొంది. ఈ క్రమంలో విశాఖ పోలీస్ కమిషనరేట్ హోదాను పెంచారు. ఈ మేరకు హోంశాఖ నుండి తాజాగా ఉత్తర్వులు వెలవడ్డాయి. ఇప్పటి వరకూ ఐజీ ర్యాంక్ హోదాలో ఉన్న విశాఖ కమిషనరేట్ పరిధిని అడిషనల్ డీజీ హోదాకు అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాఖకు పోలీస్ శాఖ పరంగా రాజధాని కళ వచ్చినట్లు అయ్యిందని అంటున్నారు. చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చేసిన నేపథ్యంలో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిని అడిషనల్ డీజీ హోదాకు పెంచారు.
ఇప్పుడు జగన్ కూడా అదే మాదిరిగా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగంలోకి తీసుకుని వచ్చారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే పట్టణంలో పోలీసులకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ కత్తి మీద సాముగా ఉంటుంది. అందుకే ముందుగా విశాఖ కమిషనరేట్ హోదాను అమాంతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే సీఎం జగన్మోహనరెడ్డి మరో నెలాపదిహేను రోజుల్లో తన మకాంను విశాఖకు షిప్ట్ చేయనున్నారని స్పష్టమైన సంకేతాలు వచ్చేస్తున్నాయి.