KA Paul: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను అందరూ కమెడియన్ గా చూస్తున్నారు. ఆయన చేసే చేష్టలు, మాట్లాడే మాటలు అంతే ఉంటున్నాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రజలకు మాత్రం మంచి హస్యాన్ని పండిస్తున్నారు. ప్రముఖ సువార్తకుడుగా గతంలో దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిన కేఏ పాల్ .. ఇప్పుడు పొలిటికల్ కమెడియన్ గా మారిపోయారని అంటున్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు, ఇచ్చే హామీలు నమ్మశక్యంగా కానివి కావడంతో ప్రజలు ఆయనను లైట్ గా తీసుకుంటున్నారు.

కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిని తానే, జగన్ తన పార్టీలో చేరితే ప్రధానిని చేస్తా, పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేరితే ఏపీ ముఖ్యమంత్రిని చేస్తా అంటూ తన నోటికి వచ్చినట్లుగా మాటలు చెప్పడం చూశాం. ఆయన పై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, సెటైర్లను మాత్రం పాల్ పట్టించుకోకుండా తన దైన శైలిలో ముందుకు సాగుతూనే ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని కేఏ పాల్ ఇప్పటికే ప్రకటించారు. రీసెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా లక్షల కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఆపుతానని పాల్ చెబుతున్నారు. అన్ని పార్టీలు తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ తన తో పాటు వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా అన్నీ కలిసి వసల్తే తాము ప్రధాని మోడీ వద్దకు తీసుకువెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతానని కూడా అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ రీసెంట్ గా కేఏ పాల్ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ సందర్బంలో పోలీసులు కేఏ పాల్ దీక్షను భగ్నం చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు అనే విషయాన్ని కూడా ప్రకటించారు కేఏ పాల్. తాను విశాఖ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, యువత ఉపాధి అవకాశాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎజెండాగా తాను విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో విశాఖ నగరంలో పార్టీ కార్యకర్తలు, పాస్టర్లతో పాల్ సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో త్వరలో విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు పాల్. ఏపీలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురూ మోడీకి మద్దతు ఇవ్వడంతో రాష్ట్రం అధోగతి పాలు అవుతోందని ఆరోపించారు.

ఇక కేఏ పాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయాలను ఒక సారి పరిశీలన చేస్తే ఆయన 2019 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. గెలిచేది తానేనని ప్రకటించుకున్నారు. చివరకు ఆయన పోల్ అయిన ఓట్లు కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే. ఆ తర్వాత తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కూడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. మాటలు కోటలు దాటతాయి.. చేతలు గడప దాటవు అన్నట్లుగా కేఏ పాల్ వ్యవహారం ఉంటుందని అందరూ అంటుంటారు.
మరో పక్క కేఏ పాల్ కు చెందిన రాజకీయ పార్టీ ప్రజాశాంతికి ఈసీ జలక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 537 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుండి తొలగించింది. ఆ పార్టీల గుర్తింపును, ఎన్నికల గుర్తులను సైతం రద్దు చేసింది ఈసీ. ఇంతకు ముందు ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు ఉండటం వల్ల ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులకు ఎన్నికల గుర్తుగా హెలికాఫ్టర్ కేటాయించే వారు. అయితే ప్రజాశాంతి పార్టీ ఈసీ తొలగించిన జాబితాలో ఉండటంతో కేఏ పాల్ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Prashant Kishor: ఓటర్లపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు