ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు గురి చేసిందంటూ అటు వైసీపీ, ఇటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుండగా, ఆ వాదనలకు బలం చేకూర్చేలా మరో ఎమ్మెల్యే ఇవేళ మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి ఓటు వేయాలని తనను కోరినట్లు ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలోని పెద్ద స్థాయి నాయకులే నేరుగా తమను సంప్రదించారనీ, ఎన్నికలకు ముందు ఫోన్ కూడా చేశారని చెప్పారు. ఆయన చేసిన ఆరోపణలకు సాక్షంగా తన కాల్ డేటాను మీడియాకు చూపిస్తూ ఆ ఫోన్ నెంబర్ చూస్తే ఎవరిదో తెలుస్తొందన్నారు.

తాను పార్టీ నుండి బయటకు వచ్చిన మూడు సంవత్సరాల మూడు నెలలు అయ్యిందన్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అంటూ విమర్శలు చేశారు. నేను, నా వాళ్లు మాత్రమే అనే నైజం చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో తనకు సరైన గౌరవం లబించలేదని అందువల్లనే పార్టీ నుండి బయటకు వచ్చినట్లు తెలిపారు. టీ డీ పీ పతనం అవ్వడానికి నారా లోకేష్ కారణమని విమర్శించారు. గతంలోనూ చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. సీఎం జగన్ పై ఉన్న అభిమానంతోనే వైసీపీలో చేరామని తెలిపారు. అమరావతి ఉద్యమం కోసం ఉండవల్లి శ్రీదేవి పోరాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూటకొక మాట మారిస్తే ప్రజలు విశ్వాసం కోల్పోతారని ఆయన అన్నారు.
అయితే, వైసీపీకి మద్దతు పలికినప్పటికీ మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లు టీడీపీ అధికారికంగా రాజీనామా చేయలేదు. వీరిని పార్టీ సస్పెండ్ చేయలేదు. దీంతో అసెంబ్లీ అధికారిక జాబితాలో టీడీపీ సభ్యలుగానే ఉన్నారు. ఈ కారణంగా టీడీపీ విప్ జారీ చేసిన విషయాన్ని తెలియజేయడం కోసం తాను ఫోన్ చేశామని చెప్పుకునే అవకాశం టీడీపీ నేతలకు ఉంది.
రాపాక సారూ.. ఎమిటీ వ్యాఖ్యలు..! ఇది సోషల్ మీడియా యుగం.. ఆడేసుకుంటారు..!!