Mosquito: దోమల కారణంగా ప్రజలు అనేక మంది రోగాల బారిన పడుతున్నా రు. చిన్న దోమ కారణంగా డెంగీ వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పో యే పరిస్థితులున్నాయి. దోమల నివారణకు మస్కిటో కాయిల్స్, ఎలక్ర్టికల్ రీఫిల్స్, బ్యాట్స్ బాల్స్ ఇలా ఎన్నో పరికరాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం. అయినా నివారణ సాధ్యం కావడం లేదు. అయితే ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలు వినియోగించుకుని ఇళ్లల్లో దోమలను నివారించవచ్చు. ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న వేప గింజలు, కర్పూరం, చామంతి పూలు, పేడ, చక్కెర వంటి వాటిని వినియోగించి అతి తక్కువ ఖర్చుతో దోమలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
వేప పిండితో..
నీరు నిల్వ ఉన్న గుంతల్లో వేప పిండి చల్లడం ద్వారా దోమల సంతతి అరికట్టవచ్చు. నీరు నిల్వ ఉన్న గుంతల్లో, స్టోరేజ్ ట్యాంకుల్లో 100 గ్రాముల తాజా వేపగింజల పొడిని చల్లితే దోమలు గడ్లు పెట్టవు. ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా నివారించవచ్చు.
వేప నూనె దీపంతో..
వేప నూనె 200 మిల్లీ లీటర్లు, కిరోసిన్ 100 మిల్లీ లీటర్లు కలిపి లాంతర్లో వేసి ఇంట్లో దీపం వెలిగించాలి. ఆ దీపం నుంచి వచ్చే పొగ వాసనకు దోమలు దరి చేరవు. ఇలా ప్రతి ఇంటిలో ఈ దీపాలు వెలిగిస్తే ఆ పరిసరాల నుంచి దోమలను పూర్తిగా పారదోలవచ్చు.
వేన నూనె మిశ్రమం ..
వేప నూనె 2 మిల్లీ లీటర్లు, కొబ్బరి నూనె 100 మిల్లీలీటర్లలో కలిపి చెంచా ఆవ నూనె లేకుంటే నువ్వుల నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు కాళ్లు, చేతులు, శరీరానికి రాసుకోవాలి. ఈ చేదు వాసన ప్రభావంతో దోమలు దరి చేరవు.
చామంతి బిళ్లలతో ..
చామంతి పూలను ఎండబెట్టి వాటికి కొంచెం పేడ కలిపి చిన్న చిన్న బిళ్లలుగా చేసి ఎండ బెట్టాలి. బాగా ఎండిన ఈ బిళ్లలను రాత్రి పూట వెలిగిస్తే ఆ వాసనకు దోమలు ఇంట్లోకి రావు.
అంతే కాకుండా ఖాళీ సీసాలో మూడు వంతుల నీళ్లు పోసి అందులో నారింజ తొక్కలను వేయాలి. ఆ తరువాత నీటిలో యూకలిప్టస్, నిమ్మ నూనెలని నాలుగు చుక్కలు పోయాలి. అందులో నీటిపై తేలేలా చిన్న ఫ్లోటింగ్ క్యాండిల్ ను ఉంచాలి. సాయంత్రం ఈ క్యాండిల్ ను వెలిగించి హాలు, పడకగది లో ఉంచితే చాలు. అందులో ఉండే నూనెల పరిమళంతో నారింజ తొక్కల ఘాటు కలిపి ఇల్లంతా వ్యాపించి దోమల బెడద తగ్గుతుంది.
అదే విధంగా సాయంత్రం పూట కర్పూరం వెలిగించి తలుపులు మూసేయాలి. పది నిమిషాల తర్వాత తలుపులు తీయాలి. దోమలు రావు. అంతే కాకుండా వెల్లుల్లి వాసన దోమలను చెదరగొడుతుంది. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి పావు కప్పు నీటిలో మరిగించాలి. చల్లారాక ఆ నీటిని చల్లితే దోమలు రావు. ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవచ్చు. ఓ సారి ట్రై చేసి చూడండి.