Nara Lokesh: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులో, అటు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. చంద్రబాబు తరపున దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరో పక్క ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజుల సీఐడీ కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చింది. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ ఒక్కసారిగా ఖంగుతిన్నది. మరో పక్క ఏపీ సీఐడీ అధికారుల బృందం ఢిల్లీకి బయలుదేరిందన్న వార్తలు రావడంతో నేడో రేపో నారా లోకేష్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి.
ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్ ఇంతకు ముందు మీడియా సమావేశంలో లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతున్నామన్నారు. దాంతో బ్రాహ్మణి కూడా అదే మాట అనడంతో లోకేష్ అరెస్టుపై టీడీపీ వర్గాలు మానసికంగా సిద్దం అయినట్లుగా కనబడుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మరో పక్క పలువురు జాతీయ నేతలను కలిశారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై పలు జాతీయ మీడియా సంస్థలోనూ మాట్లాడారు. ఏపీకి వస్తే సీఐడీ అధికారులు అరెస్టు చేస్తారనే లోకేష్ ఢిల్లీలో ఉన్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. స్కిల్ స్కామ్ తో పాటు ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసుల్లోనూ నారా లోకేష్ పై ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.
కానీ ఇంత వరకూ లోకేష్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చకపోవడంతో ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం లేదు. సీఐడీ అధికారులు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా చంద్రబాబు మాదిరిగానే ముందుగా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేస్తారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. వైసీపీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాయని టీడీపీ అంటోంది. లోకేష్ కూడా అరెస్టునకు సిద్దమయ్యే ఉన్నారనీ, అయితే ఢిల్లీలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తే అది జాతీయ స్థాయిలో హైలెట్ అవుతుందన్న ఆలోచనతోనే అక్కడ ఉన్నారని అంటున్నారు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తో పాటు మరో ఎస్పీ, ఇద్దరు సీఐ స్థాయి అధికారులు, నలుగురు కానిస్టేబుళ్లు ఢిల్లీకి పయనమయ్యారని వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి కేసులను ఎక్కువగా శని, ఆదివారాల్లో చేస్తుండటంతో లోకేశ్ అరెస్టు కుడా నేడో రేపో ఉండవచ్చనే మాట వినబడుతోంది. సీఐడీ అ విధంగా స్టెప్ తీసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సి ఉంది.
Chandrababu Arrest: చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ .. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు పచ్చజెండా